మోడీకి సుద్దులు చెపుతున్న పెద్దన్న

 

ప్రపంచాదేశాలకి తనని తానూ పెద్దన్నగా భావించుకొనే అమెరికా, ఒక దేశంగా ఉద్భవించిన నాటి నుండి ఏదో ఒక దేశంలో తన యుద్ధం సాగిస్తూనే ఉంది. కానయితే, దానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’, ‘శాంతి స్థాపన’అనే రెండు హుందా అయిన పేర్లను తగిలించు కొంటుంది.

 

హిరోషిమా నాగాసాకిల మీద అణుబాంబులు వేసి లక్షలాది ఆమయక ప్రజలను బలిగొన్నఅమెరికా, అప్పుడూ ప్రపంచ శాంతికే ఆ పని చేసానని చెప్పుకొంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆధునిక ఆయుధాలను తయారుచేసుకొనే అమెరికా, శాంతి స్థాపనపేరిట వాటిని ఇతరదేశాలలో సామాన్య పౌరులపైన, పిల్లలు, వృద్ధులు, మహిళలపైన ప్రయోగించి పరీక్షించుకొంటూ తన పైశాచిక మనస్తత్వాన్ని చాటి చెప్పుకొంటూనే, మరో వైపు ప్రపంచానికి శాంతి ప్రవచనాలు చిలకల అప్పజెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు.

 

అలనాటి వియత్నాం యుద్ధం మొదలుకొని నిన్న మొన్నటి ఇరాక్ యుద్ధం వరకు అమెరికా ప్రపంచ శాంతి స్థాపన కోసం చాలానే యుద్ధాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది కూడా. ఇరాక్ లో ప్రజాస్వామ్యం పునరుద్దరించేసి, అక్కడ శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్నవెంటనే, అమెరికాకు అత్యవసరంగా లాడెన్ కోసం ఆఫ్ఘానిస్తాన్ బయలుదేరవలసి వచ్చింది.

 

ఇరాక్ యుద్ధంలో తన అత్యాదునిక ఆయుధ సంపత్తిని అక్కడి ప్రజలకి పరిచయం (?) చేసిన అమెరికా, ప్రపంచంలోకెల్లా అత్యంత విలువయిన ప్రాణులయిన తన సైనికుల ప్రాణాలు కాపాడుకొనే గొప్ప ఆలోచనతో ‘డ్రోన్’ వంటి మానవరహిత యుద్ధవిమానాలతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో ఉగ్రవాదుల కనబడుతున్న ప్రజల నెత్తిన బాంబుల వర్షం కురిపిస్తూ, తన సరికొత్త ఆయుధాలు కూడా సమర్ధంగానే పని చేస్తున్నాయని రూడీ చేసుకొనే అవకాశం పొందింది.

 

కానీ, పామరులయిన జనాలు మాత్రం అమెరికా చేస్తున్న ఈ శాంతి స్థాపన కార్యక్రమాలను అపార్ధం చేసుకొనడమే కాకుండా, అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని గొంతు చించుకొంటున్నారు.

 

ఇటువంటి నేపద్యంలో మొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో ఒక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరబోతే, ఆయన (కూడా) మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని కనిపెట్టేసిన అమెరికా ఆయనకు వీసా నిరాకరించింది.

 

కానీ, తనకు మాత్రం ఆ సూత్రం వర్తించదని మనస్పూర్తిగా నమ్మే దేశం కనుక, తనకు తానే ఒక ‘యూనివర్సల్ వీసా’ మంజూరు చేసుకొని, ఏదేశంలో కావాలంటే ఆ దేశంలోకి తన విమానాలలో గుట్టలుకొద్దీ బాంబులను నింపుకొని జొరబడి అక్కడ తన శాంతి స్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టగలదు.

 

ఎందుకంటే, ప్రపంచానికి పెద్దన్న అయిన తానూ ప్రపంచం దేశాలలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం పరిరక్షణ చేయవలసిన గురుతరమయిన బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తోంది గనుక. అయినా వెర్రి ప్రజ అర్ధం చేసుకోదూ.