తెలుగు వారిపై వివక్ష ఎందుకు మోడీ?

 

సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.అయితే విగ్రహావిష్కరణ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తెలుగు భాషకు చోటు దక్కకపోవటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఐక్యతకు చిహ్నం అయితే అందులో తెలుగు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

"భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు స్టాచ్యూ ఆఫ్ యునిటీ వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా? ప్రతి తెలుగు వారూ అలోచించి, తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

"ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చెయ్యడంలో మోడీ జీ సఫలీకృతం అయ్యారు. కానీ.. పటేల్ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మోడీ విఫలం అయ్యారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీ మరో సారి దెబ్బతీసింది" అని లోకేష్ ట్వీట్ చేశారు.