ఏపీ, తెలంగాణ రాజకీయాలు కవర్ చేసిన లోకేష్

 

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజా ఏపీ, తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ 'వైసీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం'.. ఇక తెలంగాణ విషయానికొస్తే 'కేసీఆర్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు'. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేష్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్‌, పవన్‌ కళ్యాణ్ చేతులు కలిపితే టీడీపీ ప్రభంజనం వీస్తుందని అన్నారు. ఆ ఇద్దరూ కలిస్తే టీడీపీ నెత్తిన పాలుపోసిన వారవుతారని, టీడీపీ 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపారు. ఇక జగన్‌, పవన్‌.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీ 174 సీట్లలో విజయం సాధిస్తుంది అన్నారు. ఒక్క పులివెందుల విషయంలోనే కొంచెం డౌట్‌ అని చమత్కరించారు. జగన్‌ నేతృత్వంలో ప్రతిపక్షం అనేది అర్థం కోల్పోయిందని, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. 'మాట్లాడితే అవినీతి ఆరోపణలు చేస్తారు. 108లో అవినీతి అన్నారు, ఐటీలో అవినీతి అన్నారు. నాపైనా అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్క కాగితమైనా చూపించగలిగారా? రుజువు చేయమని అడిగీ అడిగీ ఓపిక నశించింది’ అని చెప్పారు.

కేసీఆర్ నాలుగున్నరేళ్లు ఇంట్లో గడిపి.. ఇప్పుడు బయటకు వచ్చి దిగజారిన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారంటే ఆయన నిరాశా నిస్పృహలకు గురయ్యారని అనిపిస్తోందని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే సంపద పెరిగిందని కేసీఆర్‌, హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని ఆయన కుమారుడు కేటీఆర్‌ గతంలో వ్యాఖ్యానించారన్నారు. వారే ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టి తీవ్రపదజాలంతో దూషిస్తే.. టీడీపీ చిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హుందాగా ఆ మాటల్ని తిప్పికొట్టిందని చెప్పారు. తెలంగాణలో ఉత్పాదక రంగం ఎక్కుడుందని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమైనా రాలేదన్నారు. మైక్రోమాక్స్‌ వంటి సెల్‌ఫోన్‌ సంస్థ నామమాత్రంగా ఉత్పత్తి ప్రారంభించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల విషయంలో ఏపీతో తెలంగాణకు పోటీయే లేదని.. హైదరాబాద్‌లో కూడా రోడ్లు బాగా లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడా కనపడరని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో జీవోలను కూడా పెట్టనివారు.. ఐటీ గురించి, పారదర్శక పాలన గురించి ఎలా చెప్పుకొంటారని లోకేష్ ప్రశ్నించారు.