9 నెలల్లో జగన్ సర్కార్ 3 పనులు కరెక్ట్ గా చేసింది: లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన, వైసీపీ పైన టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మేం ప్రజా చైతన్య యాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? అని ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందని విమర్శించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. తొమ్మిది నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప జగన్ సర్కార్ చేసిన ఒక్క మంచి కార్యక్రమం లేదని విమర్శించారు. 

జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడే మూడు పనులు చేశారన్నారు. అవి ఏంటంటే.. రంగులు వేయడం, దాడులు చేయడం, హామీలపై వెనక్కి పోవడం.. అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఈ మూడే జరుగుతున్నాయని విమర్శించారు. జగన్‌ వల్ల ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోయిందని ఆరోపించారు. 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. జనం గగ్గోలు పెడుతున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రై 9 నెలలైంది.. కానీ ఒక్క ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెట్టే ధైర్యం కూడా లేదని లోకేష్‌ విమర్శించారు. ‘‘నీ కేసులు సంగతేంటి?.. కేంద్రం నిధుల సంగతేంటి?.. హోదా ఏమైంది?.. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని జగన్‌ భయపడుతున్నారు అని లోకేష్ అన్నారు.