సాక్షిపై రూ. 75 కోట్లకు లోకేష్ పరువునష్టం దావా!!

సాక్షి దినపత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' అంటూ గత ఏడాది సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు. తప్పుడు కథనంతో తన పరువు ప్రతిష్టలకు ఉద్దేశపూర్వకంగా మంటగలిపేందుకు ప్రయత్నించారని.. సాక్షిపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.  విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేష్ పేర్కొన్నారు.

2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లలో.. లోకేష్ రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని, అదంతా ప్రజాధనమని సాక్షి రాసింది. అయితే.. సాక్షి పత్రిక ప్రచురించిన తేదీల్లో లోకేష్ విశాఖలో లేరు. అదే సమయంలో.. ఆ ఖర్చంతా ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చుగా తేలింది. ఈ విషయాలను బయట పెట్టిన లోకేష్.. క్షమాపణ చెప్పాలని కోరుతూ.. సాక్షి యాజమాన్యానికి లేఖ రాశారు. అయితే సాక్షి పత్రిక.. తమ కథనానికి వివరణ ప్రచురించడానికి నిరాకరించడంతో.. లోకేష్ న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో తప్పుడు కథనం ప్రచురించారంటూ.. సాక్షిపై రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు.