దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించండి

 

వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌పై కేసులు పెట్టుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు.ఆటోనగర్‌లో నిర్మించనున్న తెదేపా జిల్లా కార్యాలయానికి లోకేశ్‌ భూమిపూజ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు తెదేపాకు ఉన్నారని,రాజకీయ ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా హింసించినా.. నమ్ముకున్న జెండాను విడిచిపెట్టని కార్యకర్తలే తెదేపా బలమని వ్యాఖ్యానించారు.'పదేళ్లపాటు పాలకులు 672 మంది కార్యకర్తలను చంపారు. పరిటాల రవీంద్రను కుడా పార్టీ కార్యాలయంలో హత్య చేశారు. కార్యకర్తలను హింసించి.. లొంగకపోతే అంతం చేశారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ.. కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా 3వేల మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.23కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

లక్ష కోట్లు దోచేసి జైలుకెళ్లిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని జగన్‌కు సవాలు విసిరారు. పొరుగు జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ.. కనీసం శ్రీకాకుళం జిల్లాలో తుఫానుతో అతలాకుతలమైన ప్రాంతాలవైపు జగన్‌ కన్నెత్తి చూడలేదని గుర్తు చేశారు. తుఫాను వచ్చిన ఏడు రోజులకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌.. ఏవో విమర్శలు చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు సేవ చేయకపోవడమే కాక.. చేస్తున్న వారిని విమర్శిస్తారని దుయ్యబట్టారు. 

.