ఏపీలో ఏబీసీడీ పాలన 

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో  ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.  ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని భయానక పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు. 

ఏపీలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా?.. ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చంద్రబాబు.