హరికృష్ణ ఆవేదనకి అర్ధం ఉందా

 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నందమూరి హరికృష్ణ పార్టీలోనే ఉన్నపటికీ ఇంతవరకు పార్టీతో మమేకం కాలేకపోతున్నారు. కనీసం పార్టీలో ఇమడలేకపోయారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు వచ్చి రభస చేయడం లేదా పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం తప్ప ఆయన పార్టీకి చేసిందేమీ లేదు. తెదేపా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ గనుక తనకు ఎల్లపుడు కూడా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకొంటూ, అది దక్కకపోవడంతో భంగపడి రచ్చ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. సినిమాలలో ఆయన హీరో వేషాలు వేసి తన పాత్రలను గొప్పగా రక్తి కట్టించి ఉండవచ్చును. కానీ, రాజకీయాలలో రక్తి కట్టించాలంటే ఆ నటనతో బాటు లౌక్యం, కలుపుగోరుతనం, సర్దుబాటు గుణం కూడా చాలా అవసరమే. ఆ గుణాలేవీ ఆయనకు లేకపోవడం వలననే ఆయన నేటికీ తెదేపాలో ఇమడలేక, గౌరవం పొందలేక అత్మన్యూనతతో బాధపడుతున్నారు.

 

ఆయన పార్టీ ద్వారానే రాజ్యసభకు పంపబడినప్పటికీ కనీసం మాటమాత్రంగానయినా చెప్పకుండా సమైక్యాంధ్ర కోసం అంటూ రాజీనామా చేశారు. అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ చంద్రబాబు తన పార్టీని రెండు ప్రాంతాలలో బ్రతికించుకోవాలని తిప్పలు పడుతుంటే, హరికృష్ణ మాత్రం అదేమీ అర్ధంకాకనో లేక పార్టీ సమస్యలతో తనకు సంబంధం లేదనో రాజీనామా చేసి ‘చైతన్య యాత్ర’కి కూడా సిద్దపడి, ఆయన తమ పార్టీ విధానానికి అనుగుణంగా కాక, తన నిర్ణయానికి అనుగుణంగా పార్టీ మారలన్నట్లు వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించడం సహజమే. అయితే ఆ తరువాత ఆయన తన యాత్రను మళ్ళీ ఎందుకో విరమించుకొన్నారు.

 

ఆయన పార్టీకి ఏమీ చేయలేకపోయినా కనీసం రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకయినా ఏమీ చేయలేకపోయారు. కానీ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ అనుసరించిన తీరుని ఎండగడుతూనే, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు, వారి వేదనకు తన ప్రసంగంలో అద్దం పట్టారు. అదే సమయంలో తమ పార్టీ విధానాన్ని కూడా గట్టిగా వినిపించి పార్టీకి అండగా నిలబడ్డారు. ఆయన సభలో చేసిన ప్రసంగం సభ్యులందరినీ, సీమాంధ్ర ప్రజలని కూడా ఆకట్టుకొంది. కానీ హరికృష్ణ ఆవేశంలో అనాలోచితంగా తన పదవికి రాజీనామా చేసి పార్టీనీ, ప్రజలనీ కూడా కించపరిచారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసానని చెప్పుకొన్న ఆయనే మళ్ళీ మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో తనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయమని కోరడం ఒక తప్పయితే, భంగపడి మళ్ళీ పార్టీపై నిప్పులు కక్కడం మరో తప్పు.

 

ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు తనను ఆహ్వానించలేదని, పార్టీ కార్యక్రమాల గురించి టీవీలలో చూసి తెలుసుకోవలసిన దుస్థితి తనకు ఏర్పడిందని, అసలు తాను పార్టీలో ఉన్నానా లేదా? అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీకి చెప్పకుండా రాజ్యసభకు రాజీనామా చేసినందునే తనను పార్టీ దూరం పెడుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. కానీ తనని పార్టీ ఎందుకు దూరం పెడుతోందో కూడా ఆయనే స్వయంగా గ్రహించినపుడైనా తన వెనుక పార్టీని నడవాలని కోరుకోకుండా, తన అహాన్నిపక్కన బెట్టి తనే పార్టీతో కలిసి నడిచే ప్రయత్నం చేసినట్లయితే ఆయనకీ ఇటువంటి దుస్థితి, ఆవేదన ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం తన అహం పక్కన పెట్టలేనని భావిస్తే రాజకీయాల నుండి తప్పుకోవడం మేలు.