త్వరలో బాలయ్య రాజకీయ ప్రవేశం?

 

నందమూరి బాలకృష్ణ త్వరలో తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనవచ్చని కొద్ది రోజుల క్రితం ఇదే శీర్షికలలో వ్రాయడం జరిగింది. అనేక రోజులుగా పార్టీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు ఆయనని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకోమని కోరుతున్నపటికీ, తన సినిమా షూటింగ్ ల వల్ల ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే ఆయన ఈనెల సంక్రాంతి పండుగ తరువాత పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

 

ఈ నెల 14వ తేదిన ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామంలో తన తండ్రిగారయిన స్వర్గీయ తారక రామారావు మరియు రామకృష్ణ రెడ్డి విగ్రాహావిష్కరణలతో తన రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చునని సమాచారం. ఆ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జేరవచ్చునని తెలిసింది.

 

గత కొంత కాలంగా కాంగ్రెస్ తన నగదు బదిలీ పధకంతో చేస్తున్నహడావుడిని నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈ ఏడాది చివరిలోగా ఎప్పుడయినా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలకి వెళ్ళినా వెళ్ళవచ్చునని గట్టిగా నమ్ముతున్నందున, ఇప్పటినుండే బాలయ్య బాబు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటే, ఎన్నికలనాటికి పార్టీ నేతలతో కార్యకర్తలతో మంచి అవగాహన పెంచుకొనే అవకాశం కలుగుతుందని, ప్రత్యర్దుల రాజకీయ వ్యూహ ప్రతివ్యుహాలు కూడా అవగతమవుతాయని పార్టీ నేతలు భావిస్తున్నందున బాలయ్యబాబు ఈనెల నుండే తప్పక తన రాజకీయ కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చని సమాచారం. ఆ కారణంగానే, ఆయన కొత్తగా సినిమాలు కూడా ఒప్పుకోవట్లేదని, ఒక వేళ చేయవలసివస్తే, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలుగా బాలయ్య బాబు తన డేట్స్ సర్దుబాటు చేసుకొంటారని సమాచారం.

 

ఇక, ఈనెల 9వ తేదిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టేనాటికి 100 రోజుల పాదయాత్ర ముగియబోతున్న సందర్భంగా బాలకృష్ణ మరియు అతని కుమారుడు లోకేష్, తదితరులు ఖమ్మం వెళ్లి అయనను కలుసుకొనవచ్చునని సమాచారం.