కిరణ్ కుమార్ రెడ్డి పయనమెటు...?

 

పెళ్లి గురించి మాట్లాడాము... పెళ్లికూతురు పేరు గోప్యం. తాళిబొట్టు కట్టే తేది ఖారారైతే మీకందరికి శుభలేఖలు వస్తాయి..  ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా... మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంతకీ ఆయన పెళ్లిగోల ఏంటనుకుంటున్నారా.. ఏదో ఇంట్లో పెళ్లి గోల గురించి కాదులెండి. పార్టీ గురించి ఆయన ఈ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు సంగతేంటంటే...చాలా రోజుల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం పంచాయతీ కార్యాలయంలో పాల్గొని.. తన అభిమానులను, కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరించారు. ఇంతలో ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త... తమను ఏదో ఓక పార్టీలోకి తోయండి, ఆపార్టీని పట్టుకుని వేలాడుతుంటాము, ఏమీ చెప్పకపోతే ఏలాగని అడగడంతో నల్లారి పై విధంగా సమాధానం చెప్పారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు ఎవరికి తోచిన విధంగా వారు ఆలోచనలో పడ్డారు. కొందరు వైకాపాని, మరికొందరు, తెదేపాని, కొందరు పాతగూటికేనని ఎవరిపాటికి వారు చెప్పుకున్నారు. మరి విషయంలో నల్లారి వారి చూపెలా వుంది? ఆయన ఏ పార్టీ వైపు వెళతారు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.