సోనియా 'ఇటాలియన్ గాడ్సే'

 

 

 

తెలుగుజాతి మధ్య విభజన చిచ్చు పెట్టి, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న సోనియాని గాంధీ అనాలా? గాడ్సే అనాలా? అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన 'ప్రజాగర్జన' సభలో పాల్గొన్న బాబు సోనియా గాంధీ, కాంగ్రెస్ పై నిప్పులు కురిపించారు. తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టి, కుట్రలు పన్ని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి...ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


మన్మోహన్ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో రోబోలాంటివాడని,ఆమె ఏమి చెబితే అది చేస్తాడని దుయ్యబట్టారు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి మాట్లాడుతూ... చిన్న రాష్ట్రాలు కావాలంటున్నారు, కానీ, బలవంతం చేయడానికి వీలులేదన్నారు. మరి ఇప్పుడు సోనియా ఏమి చేశారు? రాష్ట్రపతి ఎందుకు ఏమీ చేయలేకపోయారు? అని ప్రశ్నించారు.

కొత్తగా వచ్చాడో సైకో, తెలంగాణలో పార్టీని మూసేసి ఇప్పుడు సోనియావాదాన్ని పట్టుకు తిరుగుతున్నారు అని జగన్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒక కుట్రలో భాగంగా చేరాయని ఆరోపించారు. వచ్చె ఎన్నికల్లో వైకాపా, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.  ప్రజాగర్జనకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. పదునైన విమర్శలు చేస్తున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు.