కరోనా హాట్ స్పాట్ గా సాగర్ సభ ! ప్రగతి భవన్ లో టెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేదికపై భగత్ తో మాస్క్ లేకుండానే మాట్లాడారు కేసీఆర్. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు. దీంతో టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.

నాగార్జున సాగర్ లో ప్రచారం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలలో చాలా మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పాల్గొన్న నేతల్లోనూ చాలా మంది కరోనా భారీన పడ్డారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా తిరుపతి సభకు వచ్చిన తర్వాతే అనారోగ్యానికి గురయ్యారు. తిరుపతిలో ప్రచారం చేసిన చాలా మంది వైసీపీ, టీడీపీ నేతలు కరోనాతో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.