రేపిస్టుని చంపేసిన జనం

 

నాగాలాండ్ రాష్ట్రం ఒక అటవీ ప్రాంతం. ఇక్కడ ఆటవిక న్యాయం జరగడం సహజం. తాజాగా మరో ఆటవిక న్యాయం ఇక్కడ జరిగింది. నాగాలాండ్‌లోని దిమాపూర్ ప్రాంతంలో ఒక మహిళ మీద ఒక వ్యక్తి అత్యాచారం జరిపాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే జనానికి మాత్రం ఆగ్రహం తగ్గలేదు. దాంతో అందరూ ఒక్కటై సదరు రేపిస్టు వున్న జైలు మీద దాడి చేశారు. సయ్యద్ ఫరీద్ ఖాన్ అనే ఆ రేపిస్టును జైల్లోంచి బయటకి లాక్కొచ్చి అందరూ కలసి దారుణంగా హింసించి చంపేశారు. ఈ ఘటనలో మరణించిన ఫరీద్ ఖాన్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా నాగాలాండ్‌లోకి వలస వచ్చిన వ్యక్తి. కార్ల డీలర్‌గా పనిచేసేవాడు. నాగాలాండ్‌కి చెందిన ఒక యువతిని చాలారోజులపాటు నిర్బంధించి అత్యాచారం జరిపాడు. ఇతనని చంపాలని నిర్ణయించుకున్న వాళ్ళు జైలు మీద దాడి చేసి అతనిని ఊరేగింపుగా తిప్పుతూ దారుణంగా కొట్టి చంపడం మాత్రమే కాకుండా దారిలో కనిపించిన వాహనాలన్నిటినీ ధ్వంసం చేశారు. జైలు గేట్లను పగులగొట్టి లోపల వున్న నిందితుడిని బయటకి తీసుకెళ్ళారని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి జనాన్ని చెదరగొట్టేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది.