మజ్లిస్, తెరాస సేం సేం: మైసూర రెడ్డి

 
 

యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యుడు అక్బరుదీన్ ఓవైసీ చేసిన విద్వేష ప్రసంగంపై యావత్తు దేశమూ ముక్తకంఠంతో నిరసనలు తెలియజేస్తుండగా, అతని స్నేహహస్తం అందుకోవాలని తహతహ లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అతని ఖడించక నోరు మెదపకుండా కాలక్షేపం చేస్తోంది. అయితే, తెరాస మరియు తెదేపాలు, ఆ పార్టీని దుయ్యబడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకూడా మతతత్వ పార్టీ గనుకనే అది మజ్లిస్ ని విమర్శించడానికి వెనుకాడుతోందని దాడి చేస్తుండటంతో, దానివల్ల తమ పార్టీకి మతతత్వ పార్టీ అనే ముద్రపడుతుందనే భయంతో ఈ రోజు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి మీడియా ముందుకువచ్చి మొట్ట మొదటిసారి అక్బరుదీన్ విషయంలో నోరువిప్పారు. అయితే, అతి జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడిన అయన కర్ర విరగకుండా, పాము చావకుండా, అన్న రీతిలో ఖండించేరు.

 అయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ సెక్యులర్ పార్టీ. మతం పేరిట, ప్రాంతాల పేరిట ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగోట్టడాన్ని మా పార్టీ ఎన్నటికీ సమర్దించదు. అతను అక్బరుద్దీన్ కావచ్చు, లేదా కేటీఆర్ లేదా చంద్రబాబు మరెవరయినా కావచ్చును, గానీ ఎవరూ కూడా మతం, ప్రాంతం పేరిట ఇతరులను దూషించడం, ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. అటువంటి వారితో ఏవిదంగా వ్యహరించాలో మన చట్టాలకి, న్యాయస్థానాలకి  తెలుసు. ఇటువంటి సున్నితమయిన అంశాలను కూడా రాజకీయం చేసి మా పార్టీ పై బురద జల్లాలనుకోవడమే దురదృష్టకరం. మా పార్టీని మతతత్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఇదే చంద్రబాబు ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పేందుకు మతతత్వ పార్టీ అయిన బీజేపీ తో చేతులు కలిపిన సంగతి ఆయన మరిచిపోయినా ప్రజలు నేటికీ మరిచిపోలేదని ఆయన తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు ప్రజలను సన్మార్గంలో నడిపించాలి తప్ప ఇటువంటి విషయాలను అవకాశంగా తీసుకుని ప్రజలను రెచ్చగొట్టడం రికాదని తెలుసుకోవాలి.’’

 

మైసూర రెడ్డి తమ పార్టీని వెనకేసుకు వస్తూనే, తెరాస కూడా ప్రాంతీయ భావాలు రెచ్చగొడుతోందని ఆరోపించడం ద్వారా అది కూడా మజ్లిస్ పార్టీకి తక్కువేమికాదనే అభిప్రాయం వెలిబుచ్చేరు. అదే సమయంలో తెదేపా-భాజపాల మైత్రీ బందం మరో మారు చంద్రబాబుకు గుర్తుచేసి, ఆ పార్టీ అధికారం కోసం ఒక మతతత్వపార్టీతో చేతులు కలపడానికి వెనకాడలేదని చెపుతూనే, మరి అటువంటప్పుడు తాము మాత్రం మజ్లిస్ పార్టీతో కలిస్తే తప్పేమిటనట్లు ఉదేశ్యం వెలిబుచ్చేరు.

కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ దానికి మద్దతు ఇస్తే ఒకలాగా, మద్దతు ఇవ్వకపోతే మరోలాగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు.

 

మొత్తం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ విదంగా మాట్లాడటం మెచ్చుకోవలసిందే.  శాస్త్రప్రకారం మమ అనడం జరిగింది. తమ రహస్య స్నేహితుడిని నొప్పించకుండా మాట్లాడటం జరిగింది. పనిలోపనిగా తమపార్టీని ఎండగడుతున్న శత్రు పార్టీలకు చురకలు కూడా వేయడం అయిపొయింది. అందుకే రాజకీయ పార్టీలు మైసూరా వంటి సీనియర్ రాజకీయ నేతలను కోరుకుంటాయి.