నగరంలో హత్యలకు పోలీసులే సాక్ష్యం

 

నగరంలో రోడ్లు రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. వరుస హత్యా ఉదంతాలతో నగరం ఉలిక్కిపడింది. హత్యలు జరుగుతుంది ఏ నిర్మానుష్య ప్రాంతాలలో అనుకుంటే పొరపాటే.. జనావాసాల్లో అందరు చూస్తుండగానే అతికిరాతకంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని పలు మార్లు పొడిచి చంపుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. కళ్లెదుట రక్తం మడుగులో బాధితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నచోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకున్నవారే లేరు. పోలీసుల కళ్లెదుటే హత్యలు జరుగుతున్నా హత్యలకు సాక్ష్యాలుగా మిగిలుతున్నారే తప్ప నిందితున్ని అదుపు చేయలేకపోతున్నారు. నెల క్రితం అత్తాపూర్‌  లో నడి రోడ్డుపై ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది.

సాలార్‌జంగ్‌ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్‌ వద్ద రాత్రి 7.30 గంటలకు షకీర్‌ ఖురేషి, అబ్దుల్‌ ఖాజాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంతో ఖురేషి ఆటోలోంచి కత్తి తీసి అబ్దుల్‌ఖాజాపై దాడి చేశాడు. చనిపోయేముందు ఆటోడ్రైవర్‌ కేకలు వేస్తుండగా దూరంగా ఉన్న ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అక్కడికి రాగా..వస్తే నిన్నూ చంపేస్తానంటూ హెచ్చరించడంతో  వెనక్కి తగ్గాడు. అక్కడున్నవారు తమకేం పట్టనట్టు చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకొనే సాహసం చేయలేదు. మరికొందరు హత్య ఉదంతాన్ని అడ్డుకోకపోగా సెల్ ఫోన్లలో చిత్రీకరించటం గమనార్హం. కాగా కడుపులో పోట్లు పొడిచి హత్య చేసిన నిందితుడు..హత్య తర్వాత కూడా పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. సమాచారం తెలుసుకున్న మీర్‌చౌక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు,విచారణ చేపట్టారు. అబ్దుల్‌ ఖాజా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనకెందుకులే అని కళ్లెదుటే ప్రాణాలు పోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న ఈ సమాజంలో మార్పు ఏనాడు వస్తుందో..?