అందరూ కారులోకే... టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న 90 శాతం మంది ఇండిపెండెంట్లు

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. 100 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మెజారిటీ రాని చోట్ల ఎలా పాగా వేయాలన్న దానిపై పావులు కదుపుతోంది. స్వతంత్రులుగా గెలిచిన అభ్యర్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే స్థానిక నాయకత్వం వీరితో మాట్లాడుతూ పార్టీకి మద్దతు కోరుతోంది. రాబోయే నాలుగేళ్ళ పాటు టిఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. గెలిపించిన వార్డు ప్రజలకు అభివృద్ధి చేసే అవకాశం టీఆర్ఎస్ ద్వారానే లభిస్తుందని.. స్వతంత్రులకు వివరిస్తున్నారు. 90 శాతం మంది ఇండిపెండెంట్లు టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారని స్థానిక ఎమ్మెల్యేలు పార్టీకి తెలియజేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు టిఆర్ఎస్ భావిస్తుంది. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇన్ చార్జిలు.. జిల్లా మంత్రులతో కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్లు , కౌన్సిలర్ల సంఖ్యతో పాటు మునిసిపల్ చైర్మన్ , మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావల్సిన బలం అవసరమైన ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య పై కేటీఆర్ చర్చిస్తున్నారు.  

ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యులను స్థానికంగా ఏ  మునిసిపాలిటీలకు ఎంచుకోవాలో పార్టీ సూచిస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్న చోట్ల ఒకటి రెండు ఓట్లు అవసరమైన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక మేయర్లు, చైర్మన్ లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ ల ఎంపిక కోసం కేటీఆర్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్లు , ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే సామాజిక సమీకరణాలు స్థానికంగా పార్టీకి అవసరమైన ఇతర అంశాల ప్రాతిపదికగా వారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ దిశగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి పురపాలిక పరిధి నుంచి రెండు పేర్లు చొప్పున ఓ ప్రాథమిక జాబితాను ఎమ్మెల్యేలు , పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలు ఇప్పటికే ఆయనకు పంపారు. దాన్ని పరిశీలించి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఎంపిక చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఇవాళ పార్టీ స్థానిక నాయకత్వానికి అందజేయనున్నారు. సీఎం ఎంపిక చేసిన వారికే బీఫారాలను ఇవ్వనున్నారు. ఈ పరిణామం ఇండిపెండెంట్లకు వరం అనే చెప్పుకోవాలి.