వినాయకుడికి 259 కోట్ల ఇన్సూరెన్స్

 

మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై నగరంలో వినాయకచవితిని అద్భుతంగా చేస్తారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని నినదించిన బాల గంగాధర తిలక్ ముంబైలో వినాయకచవితి వేడుకలను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ముంబైలో వినాయక వైభవం పెరుగుతూనే వచ్చింది. హైదరాబాద్‌లో కూడా ముంబై స్ఫూర్తితోనే వినాయకచవితి వేడుకలను నిర్వహిస్తారు. తాజాగా ముంబైలోని బీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయక మంటపం సంచలనం సృష్టిస్తోంది. వినాయకచవితి తర్వాత ఐదు రోజులపాటు ఈ మంటపంలో వినాయకుడిని వుంచుతారు. ఈ మంటపాన్ని, మంటపంలో వినాయకుడిని ఇన్సూర్ చేయడం విశేషం. అది కూడా మొత్తం 259 కోట్ల రూపాయలకు ఇన్సూర్ చేశారు. ఇక్కడి వినాయకుడి విగ్రహంలో మొత్తం 22 కోట్ల రూపాయల విలువైన బంగారం వుంటుందట. వినాయకుడి విగ్రహానికి, ఆ విగ్రహం మీద వున్న బంగారానికి, మంటపానికి, భక్తులకు కలిపి బీమా చేశారు. దొంగతనం, అగ్నిప్రమాదం, ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు.. ఇలా ఏం జరిగినా బీమా కంపెనీ బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్సవాలు మొదలైన తొలిరోజు నుంచి బీమా కవరేజి మొదలవుతుంది. చిట్టచివరి రోజున ట్రస్టీలు విగ్రహానికి అలంకరించిన ఆభరణాలను మళ్లీ బ్యాంకు లాకర్లో భద్రపరిచేవరకు కవరేజి కొనసాగుతుంది. ఆ తర్వాతే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారు.