ములాయంకు షాక్.. అఖిలేష్ లేకపోతే కుదరదు...

 

యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా నిన్ననే తన ప్రచార యాత్రని ప్రారంభించారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు పొత్తుకు కూడా సిద్దమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కూడా మాట్లాడుతూ.. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.  అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. మరి ములాయం దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.