గోదావరి మార్కు వెటకారం.. రఘురామ కృష్ణంరాజు రిప్లై మాములుగా లేదు

వైసిపి పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వారం రోజుల లోగా సమాధానం ఇవ్వాలని చెపుతూ నిన్న షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే దీనికి రఘురామ కృష్ణం రాజు ఒక్క రోజులోనే సమాధానమిచ్చారు. షో కాజ్ నోటీసుకు సమాధానం ఇస్తూ రివర్స్ లో ఎంపీ విజయ సాయి రెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించారు. అందరికి తన ట్వీట్లతో చుక్కలు చూపించే విజయసాయిరెడ్డికి ఎంపీ రఘురామ రాజు కూసింత తమ గోదావరి మార్కు వెటకారం జోడించి మరీ సమాధానమిచ్చారు.

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ మీరు ఎలా ఇస్తారు? అసలు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండడమేమిటి ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు క్రమశిక్షణ సంఘం అనేది ఉందా? ఒక వేళ ఉంటే ఆ క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, సభ్యులెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు కూడా పంపాలని రఘురామ కృష్ణంరాజు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరారు.

తాను ఇస్తున్నది ప్రత్యుత్తరం మాత్రమే కానీ సమాధానం కాదని అయన ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు వైఎస్సార్ పార్టీ పేరుతొ షోకాజ్ నోటిస్ పంపించడంతో దానికి చట్టబద్దత పోయిందని అయన అన్నారు. అయినా మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా.. గతంలో వేరేవారు వైఎస్సార్ పేరుతొ పార్టీ రిజిస్టర్ చేసుకున్నందువల్ల మనకు వైఎస్సార్ పేరు తో పార్టీ దక్కలేదుగా అని ఎత్తి చూపారు. కనీసం తర్వాతైనా పార్టీ పేరు మార్పుకు మనం ఎపుడు ప్రయత్నించలేదని ఆయన ప్రస్తావించారు. అంతే కాకుండా మీ పార్టీ పేరు ఎలా దుర్వినియోగం అవుతుందో చూడండి అంటూ ఈ లేఖ ప్రతిని వైఎస్సార్ పార్టీకి కూడా పంపించారు. అంతేకాకుండా మన పార్టీ పేరులో వైఎస్సార్ అనే పదాన్ని విజయసాయిరెడ్డి తన లెటర్‌హెడ్లలో వాడుకోవటం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గారికి తెలుసా అని అయన ప్రశ్నించారు. ఇదే సమయంలో మొన్న ఎన్నికలలో పోటీ చేసినపుడు తనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన కాపీ, పార్టీ ఇచ్చిన బి ఫార్మ్, అప్పట్లో ఎన్నికల సంఘం వైఎస్సార్ పేరును ఉపయోగించకూడదని ఎలక్షన్ కమిషన్ రాసిన లెటర్ ను అయన తన లేఖకు జత చేసారు. అసలు పార్టీ నియమాలను ఉల్లంఘించేవారికంటే మీరే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్నారని అయన తన రిప్లై లో స్పష్టం చేసారు. అయినా మీ నుండి సరైన విధానం లో నోటీసు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తానని ఆ ఆలేఖలో రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. టోటల్ గా పార్టీని ఢీ కొట్టేందుకే అయన సిద్దమైనట్లుగా ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. మరీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.