నాపై దాడి చేసింది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే : బాపట్ల ఎంపీ సురేష్

నిన్న అమరావతిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, తన కాన్వాయ్ లో కారు హనుమంతు అనే రైతు కాలిపై నుంచి వెళ్లిన ఘటనపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇవాళ వివరణ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సురేష్.. నిన్నటి ఘటనలకు దారి తీసిన పరిస్ధితులను వివరించారు. అమరావతికి వస్తుండగా తన కారు గుద్దుకుని ఓ వ్యక్తికి దెబ్బలు తగిలాయని, ఆయన్ను ఆస్పత్రికి తరలించాలని అనచరులకు చెప్పానని కానీ వారు కావాలని చేయలేదు కాబట్టి ఇంతటితో వదిలేయాలని వారు కోరారని సురేష్ వెల్లడించారు. అమరలింగేశ్వర స్వామి గుడి వద్ద రథోత్సవం ముగించుకుని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి వస్తుండగా కొందరు తమ దగ్గరికి వచ్చి జై అమరావతి, జై సీబీఎన్ నినాదాలు చేశారన్నారు. నినాదాలతో పాటు చెవి దగ్గరికి వచ్చి బూతులు కూడా తిట్టి వెళ్లారని సురేష్ తెలిపారు.

ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డి వాహనంలో అక్కడి నుంచి మద్దూరు వైపు బయలుదేరామన్నారు. లేమల్లె వద్ద కారు మారేందుకు కిందకి దిగిన సమయంలో అక్కడికి మహిళా జేఏసీ నేతల బస్సు వచ్చిందని, అందులో ఉన్న మహిళలు తనను చూసి జై అమరావతి నినాదాలు చేశారన్నారు. అందులో ఓ యువతి తన దగ్గరకు వచ్చి నువ్వొక ఎంపీవా, మమ్మల్ని ఏం పీకుతార్రా అని అభ్యంతరకర వ్యాఖలు చేసిందని సురేష్ వెల్లడించారు. ఆమెను తాను వారిస్తుండగానే పదిమంది మహిళలు వచ్చి తనపై కారం జల్లి దాడి చేస్తుండగా...గన్ మెన్లు జోక్యం చేసుకుని తనను కారులోకి పంపించారన్నారు. అదే సమయంలో మహిళలు తన అనుచరులపై దారి చేసి చెప్పులతో కొట్టారుని సురేష్ ఆరోపించారు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనను దళితుడని కూడా చూడకుండా టార్గెట్ చేస్తున్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను మహిళలపై దాడి చేసినట్లు కథనాలు ప్రసారం చేస్తున్న పలు ఛానళ్లపైనా సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం మాట్లాడటానికి అలవాటుపడాలని సూచించారు. గతంలో అబద్ధాలు మాట్లాడి చంద్రబాబును 23 సీట్లకు తీసుకొచ్చారని, ఇప్పటికైనా వాస్తవాలు చూపించాలన్నారు. తనపై దాడిలో పాల్గొన్నది అమరావతి స్దానికులు కాదని, వారికి అమరావతితో ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి పాల్పడిన వారంతా టీడీపీ పంపిన పెయిడ్ ఆర్టిస్టులేనని ఎంపీ సురేష్ తెలిపారు. రాజధానిలో తాము మాత్రమే బతకాలనే స్ధాయికి వీరు చేరుకున్నారని దాడి చేసిన వారినుద్దేశించి సురేష్ వ్యాఖ్యానించారు. దళితులంటే ఎలాగో విలువలేదు కనీసం ఎంపీగా అన్నా గౌరవం ఇవ్వాలి కదా అని సురేష్ తెలిపారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు ఆపాలని సురేష్ డిమాండ్ చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో యుఎస్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి  నీ అంతుచూస్తాం, నిన్నువదలిపెట్టం, ఏం పీక్కుంటావో పీక్కోరా జగన్ వచ్చి కాపాడతాడా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. బలహీన వర్గాలెవరూ ఉండకూడదు, మేమే పాలించాలని చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని సురేష్ విమర్శించారు. మహిళా జేఏసీ బస్సులో ఉన్న ఓ మహిళ కారం ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే సురేష్ అనుచరులే వేశారని చెప్పాలంటూ మాట్లాడుతున్న వీడియోను సురేష్ తన ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు.