మోడీది చేతల ప్రభుత్వం కాదు - తెరాస ఎంపీలు

 

నాలుగున్నరేళ్లు దాటినా ఇంకా విభజన హామీలు నెరవేర్చలేదని కేంద్రంపై తెరాస ఎంపీలు మండిపడ్డారు. మోడీది మాటల ప్రభుత్వంగా కనిపిస్తోందే తప్ప.. చేతల ప్రభుత్వంగా కనిపించడం లేదని లోక్‌సభలో తెరాస పక్ష నేత, ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఎంపీలు వినోద్‌, కవిత తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు విభజన హామీల అమలు కోసం ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి వినతపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు దక్కాల్సిన వాటిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల గురించి, హైకోర్టు విభజన అంశంపై కూడా మరోమారు కోరామని చెప్పారు. రీజనల్‌ రింగ్‌రోడ్డుకు నిధులు విడుదల చేయాలని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హక్కుగా ఇవ్వాల్సిన వాటినే కేంద్రం మంజూరు చేస్తోందే తప్ప.. ప్రత్యేకంగా ఏమీ ఇవ్వట్లేదని ఆరోపించారు. తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియకు కేంద్రం సహకరించాలని జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్‌ కోరుతున్నారని, నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాయని జితేందర్‌రెడ్డి అన్నారు.