అమ్మా, ఇదే బంగారు లోకం అంటే...

ఈ చరాచర జగత్తుకి తల్లి "ప్రక్రుతి" . అందుకే మనసు గతి తప్పినప్రతిసారి మనమంతా ప్రక్రుతి మాత వొడిలో సేద తీరాలి అని తపిస్తాం. అందుకే ఆ తల్లి గుండెల్లో ఎంత ప్రళయం వున్నా  , అది లోపలే దాచుకుని పైకి నిశ్చలంగా కనిపిస్తూ మనల్ని తన వొడి లోకి ఆహ్వానిస్తూ వుంటుంది . ఇదీ "అమ్మ  తనం"  అంటే... అమ్మలంతా ఇలాగె వుంటారు అందం లో సందేహం ఏమాత్రం లేదు కదా... ప్రతీ స్త్రీ అమ్మ తనాన్ని వరించగానే, హటాత్తుగా పరిణతి చెందినట్టు కనిపిస్తుందంటే ఆ గొప్పతనం బిడ్డది కూడా. ప్రతీ పసిపాప , తన నవ్వులోంచి వేయి ఏనుగుల బలాన్ని మూటగట్టి అమ్మకు అందించబట్టి కాదూ , ఇలా అమ్మలంతా  "సూపర్ మామ్స్" గా తయారు కాగలుగుతున్నారు. 

 

అప్పటిదాక తన పనే తాను చేసుకోలేక , వంట కాదు కదా , కనీసం కాఫీ కూడా కలుపుకోలేని అమ్మాయి అమ్మ గా మారాక కానీ వారి సత్తా ఏమిటో ప్రపంచానికి అర్థం కాదు. అప్పటిదాకా ప్రపంచానికి తెలిసిన కుర్రదాని లోపల , యెంత ఓపిక దాగి వుందో, యెంత ఆరాటం వుందో, అంతకు మించిన అనంతమైన మమకారం వుందో....ప్రతీ మనిషిలో , బలాలు , బలహీనతలు ఎన్నెన్నో ఉండొచ్చు గాక, కానీ అమ్మలందరికీ, తమ బిడ్డే బలం, తమ పిల్లలే బలహీనతలు... ప్రపంచంలో అద్భుతమైనదేది  ?  నవ్వా? ఏడుపా? అని అడిగితే ఏం చెబుతాం? నవ్వు ఏడుపు కలగలిపిన "ఆనందబాష్పాలు" రాల్చిన అనుభూతులే అతి మధురం అని చెప్పమూ... అలాగే, బలం, బలహీనత రెండు కలగలిపిన ఈ పేగుబంధం ఎంతో అద్భుతమైనది. అలాంటి ఈ సంబంధం , మన దైనందిన జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లకి నిలబడాల్సి వస్తోంది.

 

ప్రపంచీకరణ, నగరీకరణ నేపథ్యం లో స్త్రీ జీవితం, కత్తి మీద సాము లా తయారైంది. ప్రతీ రోజు, ఇంటా, బయటా యుధం చేయటం అనివార్యం అయింది. ఇలా ఇంట గెలుస్తూ, రచ్చ గెలుస్తూన్న అమ్మలకు, బయట చేసే సమరం కంటే, లోలోపల చేసే, అంతర్యుద్ధమే ఎక్కువ. పిల్లలను, పెంచి పోషించాలన్నా ప్రేమ పంచాలన్నా ,  వారికి యెంతో సమయం కేటాయించాలి. కేవలం సమయం మాత్రమే ఇస్తే సరిపోదు, అది యెంతో విలువలతో వున్నదై, పౌరులను, ధీరులను తయారు చేయగలగడానికి కావలసినంత సమయాన్ని సంపూర్ణంగా ఇవ్వగలగాలి. కానీ, అమ్మలందరకూ   జీవన శైలి  లో వచ్చిన మార్పులు, బతుకు చేస్తున్న డిమాండు లు , సమయభావ పరిస్థితులు ఒక వైపు వుంటే, మరో వైపు బిడ్డ కోసం అల్లాడి పోయి, వాడి చిరు చిరు నవ్వులు రోజంతా తనివి తీర చూసేందుకు  పడే తపన మరో వైపు ... ఇలా రెంటికీ మధ్యన కొట్టుమిట్టాడుతోంది అమ్మ మనసు.

 

ఇలాంటి అలజడులెన్నో అమ్మలందరిలో ఉండొచ్చు గాక... అది తీర్చే మందు మాత్రం కేవలం మీ బిడ్డ చెంతే వుంది. అందుకే, మీ పిల్లలు చెంత నున్నపుడు సమస్తం మరిచి మీరు చిన్న పిల్లలు అయిపోగలిగితే, అందులోని ఆనందం మాటల్లో చెప్పలేము. మనం పిల్లల పక్కన వుండటం వారికి ఆనందాన్ని ఇస్తుంది అంటూంటాం , కానీ అది పై పై మాట.   అసలు ఆనందం అంతా బిడ్డకు చేరువగా  వున్న అమ్మలది .... ఎందుకంటే పిల్లల ప్రపంచమంతా "సంతోషాల మూట ". అందుకే అలాంటి చోట మనమూ ఉండ గలిగితే, వారి ప్రపంచం లోకి మనమూ జొరబడ గలిగితే, జీవితం లోని ఆనందాన్ని , అద్భుతాన్ని యిట్టె పట్టేసుకోగలం .అందుకే అమ్మలంతా వీలైనంతగా "పిల్లలు" గా మారిపోండి. వాళ్ళతో చెట్టాపట్టాలేసుకుని తిరగండి. అప్పుడు మీ పిల్లలనుంచి మీకు అందే ప్రేమలో సరికొత్త బంగారు లోకాన్ని చూడగలరు.