మొత్కుపల్లి రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారా?

 

కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో వెనుకంజ వేయడంతో రైతులు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడితే దానికి కెసిఆర్‌దే బాధ్యతని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని రైతుల రుణాల మాఫీ విషయంలో నిలదీయడం సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆయన మాటలు నిరాశతో ఉన్న రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేవిలా ఉన్నాయి.

 

గతంలో తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ కూడా ఇదేవిధంగా ‘తెలంగాణా కోసం విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటే మీదే బాధ్యత’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిత్యం బెదిరించేవారు. అటువంటి మాటల వలన ఉడుకు రక్తంగల యువకులు అనేకమంది తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నసంగతి అందరికీ తెలుసు.

 

తెలంగాణా ప్రజల పట్ల తనకు చాలా బాధ్యత ఉందని భావిస్తున్న మోత్కుపల్లి కూడా ఈవిధంగా మాట్లాడటం మంచి పద్దతి కాదు. ఆయన రైతుల వ్యవసాయ రుణాల మాఫీ కోసం కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడదలిస్తే, ఆ రైతులతోనే కలిసి పోరాటం చేస్తే ఏమయినా ఫలితం ఉంటుంది. లేదా శాసనసభ సమావేశాలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. లేకుంటే, “ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోతే మీ తరపున మేము పోరాడి ప్రభుత్వం మెడలువంచయినా సరే..ఒప్పిస్తామని ఆయన రైతులకు భరోసా ఇస్తూ మాట్లాడినా అందరూ హర్షిస్తారు. అంతేకానీ రుణాలు మాఫీ చేయకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారని జోస్యం చెప్పడం చాల దారుణం. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, మీడియా, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ఖండించడం చాల అవసరం. లేకుంటే ఇదొక వికృత సంస్కృతిగా మారుతుంది.