కాంగ్రెస్ కి జలక్ ఇచ్చిన మోపిదేవి

 

వాన్పిక్ భూముల వ్యవహారంలో గతేడాది అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకి ఇంతవరకు బెయిలు కూడా దొరకలేదు. ధర్మాన ప్రసాదరావును, సబితా ఇంద్ర రెడ్డిని వెనకేసుకు వచ్చిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మోపిదేవిని మాత్రం ఎందుకో మొదటి నుండి పట్టించుకోలేదు. అదే విషయం మీడియా అడిగినప్పుడు వారిద్దరి కేసుల్లో చాలా తేడా ఉందని మాత్రమే జవాబు ఇచ్చారు తప్ప ఆయనకి ఎటువంటి సహాయము చేయలేదు. కనీసం పార్టీలో మిగిలిన నేతలు కూడా ఆయనను ఎన్నడూ పలకరించిన పాపాన పోలేదు.

 

ఒకనాడు గుంటూరులో ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, నేడు తరచూ అనారోగ్యం గురవుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గానీ కనీసం సానుభూతి కూడా చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిశ్చయించుకొన్నారు. ముందుగా ఆయన సోదరుడు హరనాథ బాబు, మరి కొందరు మాజీ సర్పంచులు, ఆయన అనుచరులు ఈ నెల 5న వైయస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకొన్నారు. ఇక మోపిదేవి, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నందున, ఆయన కూడా వైకాపా గూటిలో ఉన్నట్లే లెక్క.

 

రాయపాటి, కన్నా లక్ష్మినారాయణ, కొత్తగా చేరిన రత్తయ్య వంటి హేమా హేమీలున్న గుంటూరు జిల్లాలో మోపిదేవి నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం కలుగకపోయినా, వైకాపాకు మాత్రం చాల బలం చేకూరుతుంది. అయితే, ఎవరి కారణంగా అయన జైలు పాలయ్యాడో వారిని ద్వేషించేబదులు ఆయన వారి పంచనే చేరడం ఆశ్చర్యం. మోపిదేవి గనుక అరెస్ట్ కాకపోయి ఉంటే, మిగిలిన కాంగ్రెస్ నేతలవలే నేడు ఆయన కూడా జగన్ మోహన్ రెడ్డి ని నిందిస్తూ ఉండేవారేమో!