కూకట్ పల్లిలో నోట్ల కట్టలు

 

నిన్నటివరకు ప్రచారాలతో బిజీగా ఉన్న పార్టీ శ్రేణులు...ప్రచారం ముగిసినా కంటి మీద కునుకు లేకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. రేపు ఎన్నికల జరగనుండటంతో నేడు పార్టీ శ్రేణులు అప్రత్తమవుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టానికి ఒకరు ప్రయత్నిస్తే మరొకరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. అంతా ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. ఎంత గుట్టు చప్పుడు కాకుండా ముగించేద్దాం అనుకున్నా దొరికిపోతున్నారు. తాజాగా కూకట్ పల్లి లో ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాక ర్‌రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్‌ ఎస్‌ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. జూపూడిని అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.