ఓ కీలక చట్టాన్ని సవరించనున్న కేంద్రం.. జగన్ నిర్ణయమే కారణమా?

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక చట్టాన్ని సవరించనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ప్రాజెక్టు వ్యయం తాలూకు సొమ్మును రికవరీ చేసేలా, అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసేలా ఇంధన చట్టాన్ని సవరించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యుదుత్పత్తి సంస్థలు కానీ పీపీఏలను ఉల్లంఘిస్తే వాటిని విచారించేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల నుంచి గత ప్రభుత్వం అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ వాటితో కుదుర్చుకున్న పీపీఎలను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. తమ పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న ఆందోళనతో ఆయా సంస్థలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. తమ తమ దేశాల ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో కేంద్రం ఇరకాటంలో పడింది. పీపీఏల పునస్సమీక్షకు వెళ్లొద్దని జగన్ ప్రభుత్వానికి సూచించింది కూడా. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ పలుసార్లు లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు. 

జాతీయ స్థాయిలో 2003 ఇంధన చట్టం అమలవుతుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టంతో పెట్టుబడిదారులకు సంపూర్ణ రక్షణ లభించటం లేదని మోదీ ప్రభుత్వం భావించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఈ చట్టాన్ని సవరించి ప్రత్యేకంగా సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంపూర్ణ భద్రత కల్పించేలా ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కొద్ది రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ విద్యుదుత్పత్తి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలూ ఒక్కసారి ఒప్పందం చేసుకున్నాక వాటిని తూచ తప్పకుండా అమలు చేయాల్సిందేనని లేదంటే ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు ట్రైబ్యునల్ రంగ ప్రవేశం చేస్తుందని ప్రాజెక్టుకైనా వ్యయం రికవరీకి రాష్ట్రాలనూ ఆదేశిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ట్రైబ్యునల్ కు కట్టబెడుతూ బిల్లు ముసాయిదా ఇప్పటికే సిద్దమైందని త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.