అవినీతిపరులే బీజేపీ టార్గెట్.. ఐఏఎస్ లను కూడా వదలట్లేదు.. రాజకీయ నాయకుల్లో టెన్షన్

 

చేతిలో పార్టీ జెండా, ఆ పై స్పష్టమైన ఎజెండాతో ప్రధాని మోదీ అధికారానికి వచ్చారు. వచ్చిందే తడవుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టారు. 1980 నుంచి బీజేపీ ఎజెండాలో ఉన్న అంశాలను అమలు చేయటమే లక్ష్యంగా మోదీ అడుగులు వేస్తున్నారు. మోదీ తొలి పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఇలాంటి చర్యల ద్వారా వ్యవస్థలో మార్పులకు ప్రయత్నించారు. రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత తన గుజరాత్ సహచరుడైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాయంతో ఆయన వేగంగా దూసుకుపోతున్నారు. పదవిని చేపట్టిన మొదటి 6 నెలల కాలం లోనే కీలక నిర్ణయాల ద్వారా దేశ ప్రజల ప్రశంసలు పొందారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ను భారత్ లో పూర్తిగా అంతర్భాగం చేశారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం బీజేపీ వారి కోర్ ఎజెండాగా ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు వారి ఆలోచనా విధానాన్ని అమలు చేసేందుకు అవకాశమిచ్చింది. దానితో తన ఎజెండాలో అత్యంత కీలక అంశమైన అవినీతి నిర్మూలన పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ విధానాలను అమలు చేయటంలో మోదీది రాబిన్ హుడ్ స్టైల్ అని విదేశీ పత్రికలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. అవినీతిని నిర్మూలించటంలోనూ మోదీ, షా ద్వయం దూసుకెళ్తున్నారని చెప్పక తప్పదు. రాజకీయాల నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి, ఉద్యోగస్వామ్యం నుంచి అవినీతిని నిర్మూలించాలని మోదీ కంకణం కట్టుకున్నారు. తొలిమెట్టుగా ప్రత్యక్ష పన్నుల శాఖలో అవినీతి అధికారులుగా పేరు పొందిన 64 మందికి నిర్బంధ పదవీ విరమణ కల్పించారు. అవినీతికర ఐఏఎస్ లను కూడా వదిలేది లేదని తీర్మానించిన మోదీ సర్కార్ అలాంటి అధికారుల జాబితాను రూపొందించాలని సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించింది. 

రాజకీయాలలో అవినీతి ప్రక్షాళన చేయాల్సి ఉందని బీజేపీ చాలా రోజులుగా చెబుతున్న మాటే. అవినీతికి దూరంగా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. రాజకీయాల్లో కీలకంగా ఉంటూ అవినీతి కేసులున్న వారి జాబితాను రూపొందించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో బీజేపీ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివ కుమార్ అరెస్టును ఈ దిశగానే పరిగణించాలి. మనీ లాండరింగ్ కేసులో శివ కుమార్ కు బెయిల్ మంజూరు కాగా చిదంబరం ఇంకా కస్టడీ లోనే ఉన్నారు. నిజానికి బీజేపీ నేతల పై అవినీతి కేసులు చాలా తక్కువ. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల నేతల పై కేసులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇంత కాలం ఆడింది ఆట పాడింది పాటగా సాగించుకున్న నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడక తప్పడం లేదు. ఒక్కొక్కరిపై అవినీతి కేసుల విచారణ వేగవంతమవుతుంటే వారికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురి పై మనీ లాండరింగ్ కేసు ఉండటంతో ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మరో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు పైసల్ , అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ పై కూడా మనీ లాండరింగ్ కేసు ఉంది.ఇక పశ్చిమ బెంగాల్ లో శారద నారద కేసు, తమిళనాడులో ఎన్నికల సందర్భంగా డీఎంకే నేతల పై ఆదాయ పన్ను శాఖ కేసులు, మహారాష్ట్రలో అశోక్ చవాన్ సహా కాంగ్రెస్ నేతల పై వేర్వేరు కేసులు ఉన్నాయి. 

మన వ్యవస్థలో అవినీతి పాతుకుపోయిందని దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని బీజేపీ పట్టుబట్టింది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ నేతల పై లెక్కకు మించిన అవినీతి కేసులున్నాయి. అవినీతిపై పోరాటంలో మోదీ సర్కారుకు స్పష్టత ఉందని.. ఎన్నికల ముందు అమిత్ షా ఒక మాటన్నారు. మోదీ అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని అందుకే విపక్షాలు, మోదీ రహిత భారత్ కోసం పన్నాగం పన్నుతున్నాయని అమిత్ షా ఆరోపించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని తేల్చి చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తేనే ఆశ్రిత పక్షపాతం, దుష్పరిపాలన, పేదరికం పోతాయని బీజేపీ నమ్ముతుంది. ఇంతకాలం కాంగ్రెస్ నేతృత్వ సంకీర్ణాలు అవినీతిలో బతికాయని బీజేపీ వాదిస్తుంది. అవినీతిని నిర్మూలిస్తేనే రాజకీయాల్లో పెనుమార్పులు సాధిస్తామని బీజేపీ విశ్వసిస్తుంది. వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చిన బీజేపీ తన పాలనను శాశ్వతం చెయ్యాలంటే ఎజెండాలో ఉన్న ప్రధానాంశం అవినీతి నిర్మూలనేనని చెబుతోంది.