రాఫెల్ డీల్.. కేంద్రం సుప్రీంకోర్టుకి అబద్ధాలు చెప్పింది!!

 

రాఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు సంబరపడిపోతూ.. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సంబరాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మీద మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కాగ్ ద్వారా.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి అందజేశాం. వాళ్లకు పూర్తి అగాహన ఉంది' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో ఇది స్పష్టంగా ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగ్ రాఫెల్‌పై నివేదిక ఎప్పుడు ఇచ్చింది?.. పీఎసీ ముందుకు ఎప్పుడు వచ్చింది? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పీఏసీ చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. మరి ఆయనకు తెలియకుండా కేంద్రం చెప్పిన కాగ్ రిపోర్ట్ పీఏసీ ముందుకు రాదు కదా?. మరి కేంద్రం సుప్రీంకోర్టుకు ఎందుకు అబద్దాలు చెప్పింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారమపై పీఏసీ చైర్మన్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తాజాగా స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పార్లమెంటులో కాగ్‌ ఇచ్చిన నివేదికను ఎప్పుడు ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్‌, కాగ్‌ సమాధానం ఇవ్వాలి. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తాం అని ఖర్గే తెలిపారు. కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది?. ఆ నివేదికను పార్లమెంటు ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం అన్నారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. చూస్తుంటే రాఫెల్ రచ్చ ఇప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని వదిలేలా లేదుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.