మోదీకి పెట్రోల్ సెగ గట్టిగానే తగులుతుంది

దేశ ప్రజలను బాగా భయపెడుతున్న విషయాల్లో పెట్రోల్ ధర ఒకటి.. ఇప్పటికే 90 కి చేరువవుతున్న లీటర్ పెట్రోల్ ధర త్వరలో సెంచరీ కూడా పూర్తి చేసేలా ఉందంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.. విపక్షాలు, ప్రజలు పెట్రోల్ ధరను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శిస్తున్నాయి.. అయితే బీజేపీ మాత్రం తమది ఏం తప్పులేదంటూ సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తోంది.

 

 

సోషల్ మీడియాలో కొందరు బీజేపీ మద్దతు దారులు రాష్ట్ర ప్రభుత్వాలే అధిక పన్ను విధిస్తున్నాయి, కేంద్రానిది ఏం తప్పులేదని వెనకేసుకొస్తున్నారు.. అయితే నెటిజనులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు.. మరి గతంలో పెట్రోల్ ధర 60 దాటినప్పుడు బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నే నిందించారుగా అని ప్రశ్నిస్తున్నారు.. అదే విధంగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధర ఎక్కువగానే ఉందిగా అని అంటున్నారు. 

అయితే బీజేపీ కూడా సోషల్ మీడియాలో తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తోంది.. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2009 వరకూ పెట్రోల్ ధరలు 42 శాతం పెరిగాయని.. ఆ తర్వాత 2009-14 వరకూ ఏకంగా 83.17 శాతం పెరిగాయని బీజేపీ పేర్కొంటోంది.. అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2018 సెప్టెంబర్ వరకు కేవలం 28శాతం మాత్రమే ధరలు పెరిగాయని ప్రచారం చేసుకుంటోంది.. అయితే దీనిపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దీటైన కౌంటర్ ఇచ్చింది.. 2004లో 33.71 రూపాయలకు లీటర్ పెట్రోల్ దొరికితే.. అప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 36 డాలర్లు ఉంది.. 2014 లో క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 107 డాలర్లు ఉండగా పెట్రోల్ ధర 71 ఉంది.. 2018లో క్రూడాయిల్ ధరలు 34 శాతం తగ్గి, బ్యారెల్ కు 71 డాలర్లు ఉండగా.. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ తగ్గించకపోగా రూ. 80.73లకు పెంచిందని ఆరోపించారు.. మొత్తానికి సోషల్ మీడియాలో మోదీకి పెట్రోల్ సెగ గట్టిగానే తగులుతుంది.