ముందు మీ వాళ్లకు పోస్టింగ్ ఇవ్వండి.. వాళ్ళ సంగతి తరువాత!!

 

 

కొత్తగా ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా వారికి నచ్చిన, తమ ఆదేశాలకు అనుగుణం గా పని చేసే అధికారులను ఎంచుకోవడం మాములే. అలాగే  నచ్చని అధికారులకు లూప్ లైన్ పోస్టులు ఇవ్వడం కూడా సాధారణంగా జరిగేదే. గత మేలో జరిగిన ఏపీ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఐతే జగన్ నాయకత్వం లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల  బదిలీలు భారీగా జరిగాయి. ఈ బదిలీలలో భాగంగా కొంతమంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టటం జరిగింది. అలాగే  ఉమ్మడి రాష్ట్రము లో అప్పటి వైఎస్ ప్రభుత్వం లో కీలకంగా పని చేసిన అధికారులు కొంత మంది ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్ర కేడర్ లో పని చేస్తున్నారు. వారిలో స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి వంటి అధికారులను,  అలాగే కేంద్ర పరిధిలో పని చేస్తున్న ధర్మారెడ్డి  వంటి అధికారులను డెప్యుటేషన్ పై రాష్ట్రానికి పంపించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి  చేసింది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ లో సెలవు పెట్టి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన పై  కేంద్రం స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. మీ రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లకు పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం అలాగే కేంద్రం నుండి అధికారులు కావాలని అడుగుతారేంటి అన్నట్లుగా  తెలుస్తోంది. దాదాపు 15 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. అలాగే గత ప్రభుత్వం లో బయటి రాష్ట్రాల నుండి డెప్యుటేషన్ పైన వచ్చిన అధికారులకు కూడా పోస్టింగు ఇవ్వలేదు సరి కదా వారి సొంత కేడర్ రాష్ట్రాల కు వెళతామన్నా కొత్త ప్రభుత్వం వారిని రిలీవ్ చేయనట్లు తెలుస్తోంది. చూద్దాం కేంద్ర ప్రభుత్వం జగన్ విజ్ఞప్తిని మన్నిస్తుందో లేదో..