అవును...ఏపీ ఫోన్లు ట్యాపింగ్ చేసాము

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు టెలిగ్రాఫిక్ చట్టంలో సెక్షన్: 5క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయమని తెలంగాణా ప్రభుత్వ సంస్థలు తమను కోరాయని, దాని ఆదేశాలు పాటిస్తూ కొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేసామని ఐడియా, ఎయిర్ టెల్ మరియు రిలయన్స్ సంస్థలు సుప్రీంకోర్టుకి తెలిపినట్లు సమాచారం. కానీ అవి అధికారిక రహస్యాలు కనుక వాటిని బయటపెట్టవద్దని, బయటపెడితే ప్రాసిక్యూట్ చేస్తామని తమను హెచ్చరించినట్లు వారు సుప్రీంకోర్టుకి తెలిపారు. కానీ ఆ వివరాలను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు తమను కోరుతుండటంతో ఏమి చేయాలో పాలుపోకనే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.

 

వారి పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ఆ వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి వారం రోజుల్లోగా విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి అందజేయవచ్చని, వారికి తమ అనుమతి ఉంది కనుక తెలంగాణా ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయపరమయిన సమస్యలు రావని హామీ ఇచ్చింది. కనుక మిగిలిన అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ చేసిన కాల్ డాటాని విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి సమర్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చును.