టీడీపీని వీడనున్న మాగుంట, తోటా.. మరో ఐదుగురు కూడా!!

 

ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికారపార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీ గూటికి నేతలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం స్వప్రయోజనాల కోసం పార్టీ వీడే వారి వల్ల పార్టీకేం నష్టం లేదని.. నిజమైన నేతలు, కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని అంటోంది. ఇప్పటికే మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు టీడీపీని వీడారు. అయితే ఇప్పుడు వీరిబాటలోనే మరికొందరు నేతలు టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఇప్పటికే వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై చర్చించడానికి మాగుంట త‌న వ‌ర్గీయుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారని సమాచారం. అయితే ఆ స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే సీఎం కార్యాల‌యం నుండి ఆయ‌న‌కు కాల్ వ‌చ్చింది. సీఎంతో సమావేశం కావాల‌ని వారు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మాగంటి, సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యే అవకాశముంది. మరి మాగంటి సీఎం తో భేటీ అయ్యి టీడీపీలోనే కొనసాగుతా అంటారో లేక ఆమంచి లాగా హ్యాండ్ ఇస్తారో చూడాలి.

అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి. మాగుంట శ్రీనివాసులు, తోటా త్రిమూర్తులు మాత్రమే కాదు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు. ఒకవేళ నిజమైతే ఈ జంపింగులకు చంద్రబాబు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. మొత్తానికి ఎన్నికలకు ముందు అధికార టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పాలి.