నెలజీతం ఇచ్చిన ఎమ్మెల్సీ...ఇదొక బోడి త్యాగం!

 

 

 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విరాళాల సేకరణ ఎవరు చేయమన్నారో, విరాళాలు సేకరిస్తు్న్న వారికి వున్న అర్హత ఏమిటో, సేకరించిన విరాళాలు ఏమవుతాయో... ఇదంతా వేరే టాపిక్. అయితే ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ఎమ్మెల్సీ గారు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తనవంతు కర్తవ్యంగా చేసిన త్యాగం గురించి చెప్పుకుందాం. సదరు ఎమ్మెల్సీగారు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ తనకి ఎమ్మెల్సీగా వచ్చే జీతంలో ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. నెల జీతం విరాళంగా ఇవ్వడంతో ఆగకుండా, దాన్ని పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. ఈ పబ్లిసిటీ సందర్భంగా తాను నెల జీతాన్ని కాదు.. వందేళ్ళ జీవితాన్నే త్యాగం చేసేసినట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.


ఆయన తన మొత్తం పదవీకాలంలో తన జీతం, వసతుల కోసం ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఇచ్చిన నెల జీతం నథింగ్! అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కావల్సింది ఇలాంటి బిల్డప్పులు, బోడి త్యాగాలు కాదు.. నిజమైన త్యాగాలు. అవును... కొత్త ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గతంలో మాదిరిగా తలెత్తుకోవాలంటే నిజమైన త్యాగాలు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వేలాది కోట్ల రూపాయల భారం వుంది. ఎవరో ఒక ఎమ్మెల్సీ నెలజీతాన్ని త్యాగం చేసేసి చేతులు దులుపుకుని తనని ఆంధ్రప్రదేశ్ మొత్తం త్యాగజీవిగా గుర్తించాలంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రజా ప్రతినిధులందరూ తమ జీతాలు, వసతులు వదులుకోవాలి. ప్రజా ప్రతినిధుల జీతాలు, వసతులకే వేల కోట్ల రూపాయలు ఖర్చయిపోతున్నాయి. ఆ ఖర్చును కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మళ్ళించాలంటే ప్రజా ప్రతినిధులందరూ తమ జీతాలు, వసతులు వదులుకోవాలి. అది కూడా ఒక్క సంవత్సరం పాటు వదులుకుంటే చాలు.. ఒక్కసారి ఈ త్యాగం చేసి చూడండి.. దానివల్ల జరిగే అభివృద్ధి చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. వుందా? ఈ త్యాగం చేసే శక్తి ప్రజా ప్రతినిధులకు వుందా?