వైసీపీలో వర్గ విభేదాలు.. ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం

గుంటూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొంతకాలంగా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ ఎమ్మెల్యే రజినీ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ పర్యటనను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో వీరి మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 

నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త గంటా హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. అయితే, ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును వైసీపీ నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. పరామర్శ కోసం మాత్రమే వచ్చానని ఎంపీ చెప్పినా వినిపించుకోకుండా.. కారుకి అడ్డుపడి వాగ్వాదానికి దిగారు. అనధికార కార్యక్రమాలకు కూడా ఇబ్బంది కలిగించటం సరికాదని ఎంపీ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. ఇరు వర్గాల వాదనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసుల రాకతో అక్కడి వాతావరణం సద్దుమణిగింది. పోలీసులు సాయంతో అక్కడి నుంచి ఎంపీ బయటపడ్డారు. గతంలో పురుషోత్తంపట్నంలోనూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం అప్పట్లో సంచలనమైంది.