ఇంట్లోనే వుండండి! ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంది!

లాక్‌డౌన్ సంద‌ర్భంగా పేద ప్ర‌జ‌ల్ని ఆదుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి వ్యక్తికి ఐదుకిలోలు బియ్యం, ప్రతి కార్డుకు కేజి కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తోంది. 58 లక్షలమంది పెన్షన్ దారులకు 1 వతేదీన పెన్సన్ ఇవ్వనున్నార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ, ఏపి ఐఐసి ఛైర్మన్ ఆర్ కే రోజా తెలిపారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇస్తున్నార‌ని ఆమె చెప్పారు.

ఈ రోజు మొదటి విడత, ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29 వతేదీన మూడోవిడతగా రేషన్ ఇస్తార‌ని ఆమె తెలిపారు. 1 కోటి 40 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదీన వేయి రూపాయలు ఇవ్వాలని సి.ఎం. ఆదేశాలు ఇచ్చారని ఆమె చెప్పారు.

రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసులకు మనమందరం అండగా ఉండాలి. ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగిన సంఘటనలు వీడియోలు పోస్టు చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం పనిచేసే పోలీసులను అవమానించవద్దని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా ను పారదోలడంలో ఐకమత్యంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పాటిస్తూ బయటకు వెళ్లివచ్చే సందర్భంలో పరిశుభ్రత పాటిస్తూ కాళ్లు, చేతులు కడుగుకుని దుస్తులను సైతం హాట్ వాటర్ లో పెట్టాలని ఆమె సూచించారు.