చంద్రబాబు ఫినిష్ అంటే వైఎస్‌ చనిపోయారు

 

వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడి గురించి వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసును థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించగానే చంద్రబాబు కేంద్రం కాళ్లు పట్టుకుంటారని రోజా ఎద్దేవా చేశారు. సీఎం తర్వాత అంతటి స్థాయున్న జగన్‌పై దాడి జరిగితే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని రోజా ఆరోపించారు.

ప్రతిపక్షనేతపై దాడి జరగాలంటే చాలా పెద్ద తలకాయల హస్తం ఉండి ఉండాలని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్’ అని చంద్రబాబు వైఎస్‌తో అన్న రోజే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబసభ్యులనే పక్కకు తప్పించిన చరిత్ర బాబుదని విమర్శించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఈ దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు.

జనవరిలోనే శ్రీనివాస్ చేతికి కత్తి అందిందని అన్నారు. రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి పేరును నివేదికలో చేర్చలేదన్నారు. ఆయన లోకేష్, గంటా, నారాయణలకు అత్యంత సన్నిహితుడైనందునే పోలీసులు హర్షవర్థన్ పేరును పక్కనబెట్టారని ఆరోపించారు. ఆయన కాల్ డేటా తీయాలని డిమాండ్ చేశారు. చేతిలో సినిమాల్లేని శివాజీ చేత ఆపరేషన్ గరుడ అని డ్రామాలు ఆడిస్తున్నారన్నారు. అన్ని వివరాలు తెలిసిన శివాజీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రోజా ప్రశ్నించారు. శివాజీకి దమ్ము, ధైర్యం లేదని అందుకే అమెరికాలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు భద్రత పెంచాలని లేదంటే తామే ఆయన్ను కాపాడుకుంటామని రోజా స్పష్టం చేశారు.