ఆంధ్రజ్యోతిపై జగన్ సర్కార్ సంచలన ఆరోపణలు...

 

విశాఖ దగ్గర లోని పరదేశిపాలెంలోని రాళ్ల గుట్టల భూమిని చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ఆంధ్రజ్యోతికి కేటాయించేసిందని జగన్ క్యాబినెట్ ఆరోపించింది. మార్కెట్ విలువ నలభై కోట్లకు పైగా ఉన్న భూమిని కేవలం యాభై లక్షల ఐదు వేలకే ఆంధ్రజ్యోతికి ఇచ్చేశారని కూడా మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇక రెండు వేల పదిహేడు లోనే భూమి కేటాయించినా ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదని పేర్ని నాని అంటున్నారు, అది కూడా నిజం కాదు. ఈ భూమి ఆంధ్రజ్యోతికి అప్పనంగా వచ్చింది కాదు, జగన్ క్యాబినెట్ అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం తేరగా ధారాదత్తం చేయలేదు. పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ఆంధ్రజ్యోతికి నాటి ప్రభుత్వం ఎకరన్నర భూమి కేటాయించింది.

పత్రిక అవసరాల కోసం చట్టబద్దంగా ఇచ్చిన భూమి అది, నిబంధనల ప్రకారం చెల్లింపులు కూడా జరిగాయి, తర్వాత కొద్ది రోజులకే ఆ ఎకరన్నర భూమిలో ఓ ఎకరాన్ని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. ఇక మిగిలిన అర ఎకరం భూమి వాడుకునే వీలు లేక అలాగే వుండిపోయింది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి పరిహారంగా పరదేశిపాలెంలో ఎకరా భూమిని ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో కేటాయించింది. అంటే నాటి ఒకటిన్నర ఎకరాకు బదులుగా జరిగిన కేటాయింపు ఇది. దీని కోసం మళ్లీ కొత్తగా చెల్లింపు కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ, ఎనభయ్యవ దశకం నాటి రికార్డులు అందుబాటులో లేవంటూ కలెక్టర్ ఓ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు.

విశాఖలో ఉన్న పరిస్థితులు మార్కెట్ అన్నింటినీ లెక్క లోకి తీసుకొని ఎకరానికి యాభై లక్షలు చెల్లించాలని చెప్పారు. దాని ప్రకారమే యాభై లక్షల ఐదు వేలు చట్టబద్ధంగా చెల్లించింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. పైగా మంత్రి పేర్ని నాని చెబుతున్నట్టుగా ఈ భూమి విలువ కూడా నలభై కోట్లు కానేకాదు. రిజిస్ర్టేషన్ విలువ రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేలు మాత్రమే. పరదేశిపాలెంలో ఎకరా భూమి రాళ్లు రప్పలతో నిండిన ప్రాంతం, నిర్మాణాలు నేరుగా చేపట్టేందుకు అనుకూలంగా ఏమీ లేదు. ఇక్కడ కొండలూ గుట్టలూ చదును చేసేందుకు రెండేళ్లుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రయత్నిస్తోంది, ఇప్పటికే లక్షలు ఖర్చు చేసింది కూడా. మరి ఇలాంటి చోట పనులేమీ జరగటం లేదు అని మంత్రి పేర్ని నాని చాలా తేలిగ్గా చెప్పేశారు.

ఇది వాస్తవం కానీ, రాజకీయ ఆరోపణలు చేసి నిజాలు మరుగుపరిచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా మంత్రి మాటలతో స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ దురుద్దేశాలు, పరస్పర అవగాహన లాంటి మాటలు అనడం లోనే అసలు విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మరో విషయమేంటంటే ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పేర్ని నాని చెప్పారు.