బీజేపీ నాయకుల దొంగ దీక్ష

 

గత కొద్దిరోజులుగా అగ్రిగోల్డ్ విషయంపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై దీక్షకు దిగడంతో మరోసారి ఏపీలో అగ్రిగోల్డ్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ దీక్ష సందర్భంగా బీజేపీ నేతలు చంద్రబాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి బదులుగా టీడీపీ నేతలు కూడా బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. తాజాగా మంత్రి లోకేష్ కూడా బీజేపీ నేతల విమర్శలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేసారు. నోట్ల రద్దు నుండి రాఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి.. దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది' అని అన్నారు. 'ప్రత్యేక హోదా నుండి తిత్లీ తుఫాను సహాయం వరకూ ఏపీ దేశంలోభాగం కాదు అన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ.. అగ్రిగోల్డ్ అంటూ కొత్త కుట్రకి తెరలేపింది. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ అంశంలో బాధితులకు న్యాయం చెయ్యాలి అని సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు' అని తెలిపారు. 'కోర్టులను కించపరుస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చెయ్యడం మాని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలి' అని లోకేశ్ ట్వీట్స్ చేసారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.