అందుకే మేం టీకాలు వేయించుకోవడంలేదు: కేటీఆర్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తెలంగాణలోనూ కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. హైదరాబాద్‌ లోని తిలక్ నగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతోనే.. మొదటి విడత వ్యాక్సినేషన్ లో ప్రజాప్రతినిధులు టీకాలు వేయించుకోవడంలేదని తెలిపారు. 

 

టీకా తీసుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నా, ప్రధాని సూచనలు పాటించాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలి అనుకున్నామని తెలిపారు. అయితే, కరోనాపై ముందుండి పోరాడిన వారియర్స్‌కే ముందుగా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో తాము ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు. త్వరలోనే తాము కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమని, ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.