సీఎం కావాలనే ఆలోచన లేదు..రాజకీయ సన్యాసం తీసుకుంటా

 

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావు తెరాసని వీడటం ఖాయమంటూ ఆరోపణలు చేస్తున్నారు.అంతే కాకుండా పార్టీలో కేటీఆర్ కి ఇచ్చిన ప్రాధాన్యం హరీష్ రావు కి ఇవ్వట్లేదని,కేసీఆర్ తన తర్వాత సీఎంగా కేటీఆర్ ని చేసేందుకే హరీష్ రావు ని పక్కన పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు.మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని‌ స్పష్టం చేశారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు.మహాకూటమి పుంజుకునే పరిస్థితే లేదని, తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని తెలిపారు.105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమని.. తెరాసలో అసమ్మతి పూర్తిగా చల్లారిందన్నారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.కాంగ్రెస్‌ రూపంలో తెలంగాణలో ప్రవేశించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు కేబినెట్‌లో చర్చించడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. సోనియాగాంధీని అమ్మనా బొమ్మనా అని ఆవేశంతో అంటే దానిని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేశారని, చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం మమ్మల్ని మేల్కొలిపిందని, అందుకే తాము ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. భాజపా ఐదు సిట్టింగ్‌ స్థానాల్లోనూ ఈసారి తెరాసయే విజయం సాధిస్తుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు.