ఏపీలోని కార్పొరేట్ కాలేజీలకు మూడిందా? వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ పిల్లల గతేంటి...

ఆంధ్రప్రదేశ్ మరో ఘనత వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వడం లేదని పలు సంస్థలు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. పీపీఏల విషయంలో కోర్టులు క్రమం తప్పకుండా మొట్టికాయలు వేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ పత్రికలు కూడా మన ప్రభుత్వ నిర్వాకాన్ని ఘనంగానే ప్రస్తావించాయి. తాజాగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై పంజా విసరదానికి సిద్ధమయ్యారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది ప్రభుత్వమూ లేక ముఠా నాయకుల శిబిరమో అర్ధం కాక రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కార్పొరేట్  విద్యా సంస్థలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే అమరావతిని, ఐటి పరిశ్రమను, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు విద్యా రంగంపై పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపోవాలని సాక్షాత్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పద్దతిగా చెప్పారు. సాధారణంగా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అధికారులు అయినా ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిందేనని చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే జరుగుతాయని అందులో 25 శాతం సీట్లు బడుగు వర్గాలకు కేటాయించాలని చెబుతూ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారు రాష్ట్రం వదిలిపెట్టి పోవాలని మంత్రి హుకూం జారీ చేశారు.

బుధవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో ప్రయివేటు, కార్పొరేటు కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో జరిపిన సమావేశంలో సదరు హెచ్చరిక జారీ చేయడంతో వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆంధ్రా వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. తెలంగాణ లోని ఆంధ్రా బోర్డర్లలో భవనాలు నిర్మించుకోవడానికి లేదా అక్కడ పెద్ద భవనాలు అనువైన స్థలం ఉంటే అద్దెకు తీసుకోవాలని వెతుకులాట మొదలు పెట్టినట్టు సమాచారం. తమ విద్యార్ధులను తెలంగాణకు తరలించి తెలంగాణ ఇంటర్ బోర్డులో అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

తెలంగాణ భూ భాగంలో ఆంధ్రా సరిహద్దుల్లో  కాలేజీలు పెట్టి ఆంధ్రా విద్యార్ధులను చేర్చుకుని, అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి బస్సులు నడుపాలని చూస్తున్నారు. అలా కాకపోతే తెలంగాణ భూ భాగంలోనే అధునాతన హాస్టళ్లు నిర్మించుకోవాలని ప్రణాళికలు చేసుకుంటున్నారని వినికిడి. ఆంధ్ర ప్రాంతంలో ఇక కాలేజీలు నడిపే పరిస్థితులు  ఉండకపోవచ్చునని వారు అనుకుంటున్నారు. తెలంగాణ భూభాగంలో కాలేజీలు ఏర్పాటు చేసి ఆంధ్ర ఏరియాలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండలేని విద్యార్ధులకు ఈ కోచింగ్ సెంటర్లు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వానికి పన్నులు కట్టి కాలేజీలు నడుపుతున్న తమకు కూడా కాస్త వెసులుబాటు ఉండాలని, తమపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదని, లేని పక్షంలో తమ దారి తాము చూసుకోక తప్పదని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం సరైనదేనని ఇష్టం ఉన్నవారు ఇక్కడ ఉండండి లేనివారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం తమ పిల్లల భవిష్యత్తు ఏమిటో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.