హవాల కేసులో మంత్రి శైలజానాథ్

Publish Date:May 7, 2013

 

ఇప్పటికే పలు సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధమిక విద్యా శాఖామంత్రి శైలజానాథ్ పేరు హవాలా కేసులో బయటపడటంతో ఉలిక్కిపడింది. ప్రముఖ పరిశోధనా వెబ్ సైట్ ‘కోబ్రా పోస్ట్’ ఇటీవల డిల్లీలో నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ లో మన మంత్రిగారి పేరు బయటకి వచ్చింది.

 

కధలోకి వెళ్తే, కోబ్రా పోస్టుకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు డిల్లీలో గల ఇండియన్ బ్యాంక్ మేనజర్ మనోహర్ ని తమని తాము ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, మంత్రిగారు రూ.25కోట్లు నల్లదనాన్ని సురక్షితమయిన చోట పెట్టుబడి పెట్టలనుకొంటున్నారని, ఆయనకు నమ్మకం కలిగితే, మరిన్ని భారీ మొత్తాలు కూడా పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పడంతో, వారిని నమ్మిన బ్యాంక్ మేనేజర్ తిరుపతిలో తనకు తెలిసిన హరికృష్ణ ప్రసాద్ అనే ఒక ప్రముఖ అర్దోపెడిక్ వైద్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని, ఆయన ప్రస్తుతం భారీ వెంచర్ వేసే ఆలోచనలో ఉన్నందున ఇటువంటి భారీ పెట్టుబడికోసం చూస్తున్నారని, మంత్రి గారికి నచ్చితే అందులో పెట్టుబడి పెట్టవచ్చునని చెప్పారు.

 

అంత భారీ మొత్తం పెడుతున్న తమ డబ్బుకి గ్యారంటీ ఏమిటి? అని రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో మంత్రి శైలజానాథ్ ఆయనకు మంచి మిత్రుడని ఆయన ఈ డబ్బుకి పూర్తి గ్యారంటీ ఇస్తారని చెప్పడంతో మంత్రి గారు కూడా రంగప్రవేశం చేసారు. ఆయన బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు హామీ ఇవ్వడమే కాకుండా, మొత్తం సొమ్ము మళ్ళీ వచ్చే ఎన్నికలకి సరిగ్గా నెల రోజుల ముందుగా దేశంలో వారు ఏ ప్రాంతంలో తీసుకోదలిస్తే ఆ ప్రాంతంలో అందేలా ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో తానూ డిల్లీ వచ్చినప్పుడు పూర్తిగా చర్చించి విషయం మాట్లాడుకోవచ్చునని మంత్రిగారన్నారు.

 

అయితే, ఈ లోగా కోబ్రా పోస్ట్ తన రహస్య పరిశోధన వివరాలను వెబ్ సైటు లో పెట్టేయడంతో మంత్రిగారు వెంటనే మాట మార్చి, హరికృష్ణ ప్రసాద్ కేవలం తనకు స్నేహితుడని, ఆయన వద్ద డబ్బు పెడితే భయం లేదని మాత్రమే తానూ హామీ ఇచ్చినట్లు తెలిపారు,. తనపై వస్తున్న ఆరోపణలను గాలివార్తలని ఆయన ఖండించారు. తనకు ఎటువంటి హవాలా వ్యవహారాలతో సంబందాలు లేవని ఆయన స్పష్టం చేసారు. మరి కోబ్రా పోస్టు వారెందుకు ఆవిధంగా వ్రాశారో?