మంత్రిని కాదంటున్న మంత్రివర్యులు జీతం మాత్రం...

 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమని గర్వంగా చెప్పుకొనే మనదేశంలో ‘ప్రజాస్వామ్యం పులిహోరలో కరివేపాకు వంటిదని’ మననేతలు తమ చేతలతో నిత్యం మనకి తెలియజేస్తూనే ఉంటారు. ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రతినిధి పదవీప్రమాణం చేస్తూ తనబాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రజలకి రాజ్యాoగం సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఒట్టేసి మరీ చెప్తాడు. గానీ, ఆచరణలో మాత్రం అందుకు పూర్తీ విరుద్దంగా వ్యవహరిస్తాడు.

 

తమ బాధ్యతలను విడిచి ‘తెలంగాణా ఉద్యమం’ అంటూ తిరుగుతున్న అనేకమంది మంత్రులతో బాటు, ‘రోడ్లు మరియు భవనాల శాఖామాత్యులు’ ధర్మానప్రసాదరావు గారి గురించికూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు. సి.బి.ఐ. ఛార్జ్ షీట్ లో తనపేరు జేర్చినందున అలిగిన అయన తన మంత్రిపదవికి రాజీనామా చేయడం, దానిని మన ముఖ్యమంత్రి తిరస్కరించడం మొదలయిన కధంతా మన౦ చూస్తూనే ఉన్నాము. ఏమయినప్పటికీ తాను మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించబోనని ఖరాకండిగా చెప్పడమేగాక ఇంతవరకు ఆయన తన కార్యాలయం మొహం చూడలేదు. అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ల పరిష్కార బాద్యత తన అధికారులకే వదిలివేశారు. అలాగని, ప్రభుత్వం ఆయన కిచ్చే జీతబత్యాలు చెల్లించడం ఆపేయనూలేదు, మంత్రిగా ఆయన ప్రోటోకాల్ ను నిలిపివేయను లేదు. వాటన్నిటినీ స్వీకరించడానికి ఆయనకి ఏ అభ్యంతరము లేనప్పుడు, మరి బాద్యతలు నిర్వర్తించడానికి ఎందుకు అభ్యంతరమో ఆయనే మరి చెప్పాలి.

 

నిన్న, విశాఖలో జరిగిన మంత్రుల మీటింగుకి హాజరయిన ఆయనని పత్రికలవారు “మీరు ఏ హోదాతో ఈ సభలో పాల్గొంటున్నారు?” అని నేరుగా అడిగినప్పుడు అయన కొంతతడబడుతూ “నేను మంత్రిగా ఇక్కడికి రాలేదు. కేవలం ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చెను. నా అనుభవాలను నా సహచరులతో పంచుకోవాలని మాత్రమె వచ్చెను. ప్రభుత్వం నా రాజినామని ఆమోదిన్చకపోయినప్పటికీ, నేను ఇప్పటికీ దానికే కట్టుబడివున్నాను. అయినప్పటికీ, ప్రభుత్వం నా ప్రోటోకాల్ ను మాత్రం రద్దు చేయలేదు.” అని ఆయనే స్పష్టం చేసారు.

 

పని చేయకపోయినా జీత బత్యాలు తీసుకొంటూ, ప్రభుత్వం అందించే సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రోటోకాల్ మర్యాదలు కూడా స్వీకరిస్తూ కూర్చొనే మంత్రివర్యులకి నాడు తానూ చేసిన ‘పదవి ప్రమాణాలు’ ఇప్పుడు గుర్తుకు లేవా? లేక అదొక ‘రొటీన్ తంతు’ మాత్రమె అని అయన భావిస్తున్నారా? ఒక సామాన్య ప్రభుత్వ గుమస్తా ఒక్కరోజు సెలవు పెడితేనే లెక్కలు అడిగి జీతం కోసేసుకొనే ప్రభుత్వం, మంత్రివర్యులు ‘నేను అసలు పనేచేయను పో!’ అంటున్నాకూడా అతనికి ప్రజాధనం అప్పనంగా ఎందుకు దారపోస్తోంది? ప్రజలు చెమటోడ్చి సంపాదించుకొంటున్న సొమ్మును రకరకాల పన్నులతో వారి గొళ్ళూడగొట్టి మరీ వసూలుచేస్తున్న ప్రభుత్వం, మరి ఇటువంటి బాద్యత స్వీకరించని మంత్రులకు ఎందుకు దానిని ఊరకనే ధారపోస్తోంది. ప్రస్తుతం, ప్రభుత్వంలో లెక్క జూస్తే ఇటువంటి పనిచేయని మంత్రులు, శాసన సభ్యులు మొదలయినవారు చాలా మందే లెక్క తేలుతారు.

 

కొందరు ‘ఉద్యమాల పేరు చెప్పుకొని’ బాద్యతలు ఎగ్గొట్టి తిరుగుతుంటే, మరి కొందరు ఇలాగ వేరే కారణాలు చెప్పుతూ తప్పించుకొంటారు. బాద్యతలు చేప్పటడం అసలు తనకు ఇష్టం లేదని ఆయన అంత స్పష్టంగా చెప్పిన తరువాతకూడా ఆయనని మంత్రివర్గంలో మంత్రిగా ఎందుకు కొనసాగించవలసి వస్తోంది? ఆ పని చేయగల మొనగాడు మరొకడు లేడనా? లేక అతనిని తొలగిస్తే ప్రభుత్వానికి చెప్పలేని చిక్కులేమయినా ఏర్పడతాయని బయపడుతోందా?

ఇటువంటివన్నీ చూస్తుంటే విదేశీయులు మన దేశం గురించి నిత్యo చెప్పుకొనే ఒక మాట గుర్తుకు వస్తుంది ఎవరికయినా. ఇట్ హ్యపన్స్ ‘ఓన్లీ’ ఇన్ ఇండియా!