మహారాష్ట్రలో మెల్లమెల్లగా బలపడుతున్న ఎంఐఎం...

 

దేశంలో ఇప్పుడు రాజకీయ పక్షాల కళ్లన్నీ మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉన్నాయి. రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్రది రెండో స్థానం. ఆ రాష్ట్రంలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను ప్రధానంగా ద్విముఖ పోరే ఉన్నా, కొన్ని నియోజక వర్గాల్లో బహుముఖ పోరు నెలకొంది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రత్యర్ధులుగా తలపడుతుంటే ముస్లిం దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న చోట్ల ఎంఐఎం తన అభ్యర్ధులను బరిలో నిలబెట్టింది. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీబీఏ వేదిక అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే వీరి ప్రభావం నామమాత్రమే. 

మహరాష్ట్రలో పట్టు కోసం ఓవైసీ సోదరులు చేస్తున్న ప్రయత్నం చర్చ నీయాంశంగా మారింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇరవై ఆరు మంది కార్పొరేటర్ల బలం ఎంఐఎంకు మహారాష్ట్రలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై నాలుగు చోట్ల పోటీ పడిన ఓవైసీ బ్రదర్స్ ఈ సారి ఈ సంఖ్యను దాదాపు రెండితలు చేశారు. నలభై నాలుగు మంది అభ్యర్ధులు గాలిపటం గుర్తు పై ఎన్నికల బరిలో నిలబడ్డారు. వీరిలో పావు వంతు దళిత అభ్యర్థులు కాగా మిగిలిన వారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం ఓటు బ్యాంకే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఓవైసీ సోదరులు ఆ వర్గ జనాభా పది శాతం కంటే ఎక్కువగా ఉన్న పది జిల్లాల పై ప్రధానంగా దృష్టి సారించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముస్లిం మైనార్టీలు దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం నేపథ్యంలో ఎంఐఎం వీరిని తన వైపు తిప్పుకునేందుకు శక్తులన్నీ ఉపయోగిస్తోంది. దీనితో పాటు కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఎనర్సీ అంశాలు చర్చ నీయాంశంగా మారాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలోనే కాషాయి దళం ఈ అంశాలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చింది అన్న వాదన ఉంది. వీటివల్ల హిందూ వర్గ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయితే అదే సమయంలో ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఎంఐఎం వైపు చూసి అవకాశాలనూ కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ అంశాల పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెసును కూడా వదలడం లేదు. ఈ వ్యూహం ద్వారా ఎంఐఎం గెలుపు అవకాశాలు పెరగడం కంటే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చేరటానికే ఎక్కువ అవకాశముందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాలకు భరోసా ఇచ్చే పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంఐఎం ప్రధాన బలంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ వన్ మ్యాన్ ఆర్మీలా తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చాలా చోట్ల ఆయనే డోర్ టు డోర్ క్యాంపెన్ నిర్వహిస్తూ ఓటర్లతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నారు. బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పార్టీలో ఆత్మ విశ్వాసం పెరిగింది. అయితే రాష్ట్రంపై గట్టి పట్టున్న బీజేపీ శివసేన ఓట్ బ్యాంక్ కదల్చగలిగే సత్తా ఎంఐఎంకి ఉందా అంటే లేదనే చెప్పాలి. సభలకు వచ్చే జనాలను ఓటింగ్ వరకు తీసుకెళ్లగలిగే క్షేత్ర స్థాయి నిర్మాణం పార్టీకి లేకపోవటం ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహా ఎన్నికల్లో ఎంఐఎం ఎంత వరకూ సత్తా చాటుతుంది. మహారాష్ట్రా ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరు ఎవరిని బలంగా మార్చుకుంటారు అనేది వేచి చూడాలి.