వలస పక్షులతో కలకలలాడుతున్న నగరంలోని చెరువులు

 

వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తోంది. చలికాలం ప్రారంభమైందంటే చాలు ఏటా వర్ణ శోభితమైన పక్షులు నగరంలో చెరువుల్లో సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం నగర శివారు లోని అమీన్ పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండడంతో నూతన శోభ సంతరించుకుంటున్నాయి. సైబీరియాలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లడం తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. అందుకే సైబీరియాలో శీతలకాలం మొదలయ్యేసరికే అక్కడి నుంచి తుర్రుమంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యురేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్- హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. మధ్య మధ్యలో ఆగుతూ దాదాపు రెండు నెలల పాటు ప్రయాణం చేసి మరీ భాగ్యనగరానికి చేరుకుంటాయి. 

హైదరాబాద్ లో చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు ఆహారానికి అనువుగా ఉంటుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండడం చెరువుల మధ్యలో అక్కడక్కడ రాతిశిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్ లు ఉండటం వల్ల ప్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు ఎదురుచూసి చేపలను వేటాడతాయి. చేపలు అవసరం లేని కొన్ని పక్షులు చెరువు ఒడ్డున సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మొత్తం 380 రకాల పక్షిజాతుల్లో దాదాపు 70 నుంచి 80 వలస పక్షులు ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతూ ఉంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40 నుంచి 45 రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ప్రధానంగా ఫ్లెమింగో లోని పలు రకాల పక్షులు వెర్టిటైర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్ చాట్, నార్తరన్ శోభల, బ్లాక్ టైల్డ్ గాడ్ బీట్, ఎల్లో వాగ్ టెయిల్, హారియర్స్ లో పలు రకాల పక్షులు 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, బార్డర్స్, లిటిల్ టెన్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్ లో చూడవచ్చు. అమీన్ పూర్ చెరువు దాదాపు 300 ల ఎకరాల్లో విస్తరించి ఉంది. కృత్రిమ రమణీయతకు నిదర్శనంగా కనిపించే ఈ ప్రదేశానికి విదేశాల నుంచి వలస పక్షులు రావడం చూడముచ్చటగా ఉందంటున్నారు స్థానికులు.