ఇదేం లాక్‌డౌన్.. వీరికి అనుమతి ఎలా ఇచ్చారు?

అసలు ఈ దేశానికి విమానాల్లో కరోనా వైరస్ రావటంలో పేదల, చిరుద్యోగుల పాత్ర ఎంత? అయితే ప్ర‌స్తుత‌ వీరే బాధితులు!
ఇది ఢిల్లీ బస్ స్టేషన్ దగ్గర సన్నివేశం. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. రెండు నెలల పాటు కాదు కదా 15 రోజులు కూడా వాళ్ళు పని లేకుండా, ఆదాయం లేకుండా బతకలేరు. స్వగ్రామంలో ఎలాగైనా బతికేస్తారు. 20వ తేదీ వరకు చప్పుడు చేయకుండా ఒక్కసారిగా మూడు వారాలు బైటకి రావద్దంటే వాళ్ళకెలా? రేషన్ కార్డులు, ఓటు హక్కులు, డ్వాక్ర సభ్యత్వం అన్నీ గ్రామాల్లోనే ఉంటాయి.

లాక్‌డౌన్ కారణంగా చేసేందుకు పని లేకపోవడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయని.. దీంతో అద్దెలు కట్టలేక.. నిత్యావసరాలు కోనుగోలు చేయలేకపోతున్నామని.. అందుకే తాము సొంతూరుకు వెళ్తున్నామని బదౌనీ జిల్లా బదౌన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తెలిపాడు.

నోయిడా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన తమ వాళ్లను సొంతూళ్లకు తీసుకెళ్లడం కోసం 1000 బస్సులను పంపుతున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డీటీసీ కూడా 200 బస్సులను ఏర్పాటు చేసింది. అందుకే ఈ స్థాయిలో జనం బస్ టెర్మినల్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది ముఖాలకు మాస్కులు, కర్చీఫ్‌‌లు కట్టుకున్నారు. కానీ వాటి వల్ల ఎంత మేరకు కరోనా నుంచి కాపాడుకోగలరనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ బస్ టెర్మినల్ దగ్గర మాత్రం జనం ఒకరినొకరు తోసుకునేంతలా ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. ఆప్, బీజేపి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నిరాశ్రయులైన వీరందరికీ నివాసం కల్పించలేని ఆప్ ప్రభుత్వం కేంద్రానికి ముందుచూపు లేదని బీజేపి మీదకి తోసేస్తే, వీళ్లని నిర్దాక్షిణ్యంగా ఆప్ తరిమేస్తున్నదని బీజేపి అంటుంది. రెండూ నిజమే కావొచ్చునేమో.

ఫిబ్రవరి మొదటి వారం నుండే మెల్లగా, క్రమంగా చర్యలు చేపట్టి ఉండాల్సింది పాలకులు. ఫిబ్రవరి 24న లక్షలాదిమందితో కలిసి దేశాధినేతలు చెట్టపట్టాల్ వేసుకున్నారు.

ఏదీ ముందు చూపు ఉండదు. ప్రజల బాధలు ప్రజలవి. పాలకుల పరిహాసాలు పాలకులవి. ఈ దేశ స్వరూప స్వభావాలు, ప్రజల జీవన విధానాలు, కదలికలు, ఆర్ధిక స్థితిగతుల మీద పాలకులకు క‌నీస అవగాహన ఉండదా? ప్రజల్ని కేవలం చట్టాల ద్వారా అదుపు చేయటమేనా పాలన అంటే? పోలీసుల ద్వారా భయభ్రాంతుల్ని చేయటమేనా?