రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష పిటిషన్‌.. నిర్భయ దోషులకు ఉరి ఎప్పుడు?

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిని ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ గత మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు తాము ఉరిశిక్ష అమలు చేయబోమని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. క్షమాభిక్ష పిటిషన్‌ గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఈ పిటిషన్ పై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ మధ్యనే ఓ సందర్భంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని క్షమించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీంతో క్షమాబిక్ష పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడం ఖాయమని అర్ధమవుతోంది. అయితే ఆయన తిరస్కరించినా కూడా 22 తేదీన ఉరి తీయకపోవచ్చని అంటున్నారు. నిబంధనల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరణ తరువాత 14 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.