సీఎం అభ్యర్థిగా శ్రీధరన్.. మరో కిరణ్ బేడీనా?

అనుకున్నట్టే జరిగింది. మెట్రోమేన్ శ్రీధరన్ ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. పార్టీ జాతీయ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్ అధికారికంగా శ్రీధరన్ పేరు ప్రకటించారు. 

కేరళలో బీజేపీకి ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులే ఖరారు కాలేదు. అందరికంటే ముందు సీఎం అభ్యర్థి మాత్రం డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ మెట్రో మేన్ గా దేశమంతా సుపరిచితమైన శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. సీఎం కేండిడేట్ కు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇక శ్రీధరనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టే.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది పార్టీ. గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని శ్రీధరన్ చెప్పారు. 

శ్రీధరన్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొచ్చి అర్బన్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజధాని నుంచి బరిలో దిగితే.. యావత్ రాష్ట్రంపై ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలేస్తోంది కమలదళం. మిస్టర్ క్లీన్ గా, మెట్రో మ్యాన్ గా పాపులారిటీ ఉన్న శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావిస్తోంది. 

గతంలో ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని సీఎం కేండిడేట్ గా ప్రకటించి ఎన్నికల బరిలో దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలోనూ శ్రీధరన్ తో ఢిల్లీ తరహా ఎక్స్ పర్మెంట్ చేస్తోంది. LDF, UDF కూటములు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఎలాగూ గెలిచే అవకాశం లేని చోట మాత్రమే.. బీజేపీ కిరణ్ బేడీ, శ్రీధరన్ లాంటి మిస్టర్ క్లీన్ లను ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తూ.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంటుందనే ఆరోపణ ఉంది. అదే, పక్కా గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం RSS మూలాలున్న లీడర్లను మాత్రమే ముఖ్యమంత్రులను చేస్తుందనేది విమర్శ వినిపిస్తుంటుంది. అయితే, విద్యాధికులు ఎక్కువగా ఉండే కేరళలో శ్రీధరన్ ఇమేజ్ కమలదళానికి ఏ మేరకు కలిసొస్తుందో...