కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతున్న మెడికల్ దందా...

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తిష్టవేసింది. ఇక్కడ వైద్య వ్యాపారం కోట్లలో సాగుతోంది. ఒక్క కరీంనగర్ లోనే ప్రతి రోజు తొమ్మిది కోట్ల వరకూ జరుగుతోంది. అందుకే దీనికి డాక్టర్ ప్యారడైజ్ అని పేరుంది. చిన్న తలనొప్పి అని వచ్చినా జేబులు గుల్లయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ దందా వెనుక పెద్ద మెడికల్ మాఫియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదైనా వ్యాధితో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ అక్కడే ఉన్న హాస్పటల్ కు అనుబంధమైన మెడికల్ షాప్ లకే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకే బ్రాండ్ కు చెందిన మందులను ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఈ మందులు వేరే చోట కొందామన్నా దొరకవు. ఫార్మా కంపెనీల కమీషన్ లకు కక్కుర్తిపడ్డా కొందరు డాక్టర్ లు ఇష్టం వచ్చినట్లు మందులు రాస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బీపీ, షుగర్ ఉందని ఆస్పత్రికి వెళ్తే ఇరవై మూడు రకాల మందులు అంటగడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రిస్క్రిప్షన్ నూ నింపేస్తున్నారు. దీనిపై డాక్టర్ లను, మెడికల్ షాపు నిర్వాహకులను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు. 

మెడికల్ మాఫియా ఆగడాలు ఎంత దారుణంగా ఉంటాయంటే 150 రూపాయలున్న మందులను 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఒరిజినల్ రేటుకు ఆసుపత్రులకు అనుబంధమైన మెడికల్ షాపుల్లోని ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీళ్ల ఆగడాలను తట్టుకోలేక కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్స్ డెంగ్యూతో జనం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన మెడికల్ మాఫియా వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే యాభై వేలకు పైనే మందులకూ ఖర్చు చేయిస్తున్నారు. అందులో అధికంగా యాంటి బయటిక్స్ మందులే ఉంటున్నాయి. ఫీవర్ వచ్చిందని ఎవరైనా వస్తే చాలు రూ.1000 మందులు రాస్తున్నారు. అసలు జనరిక్ మెడిసిన్స్ మాటే ఎత్తడం లేదు. డాక్టర్ ల తీరుపై పలు సంస్థల ప్రతి నిధులు ఫిర్యాదులు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మందులు ఉపయోగిస్తున్నారు అని సమాచారం. ఒక సర్వేలో దేశం లోనే కాదు ఆసియా ఖండంలోనే టాప్ ప్లేస్ లో ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని. కొందరు డాక్టర్ ల తీరు పై సీనియర్ వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా రాస్తున్న మందులను నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 చీటీలు 66 గోలీలు అన్నట్లు సాగుతోంది మెడికల్ దందా. ఎవరైనా పేషెంట్ ఆసుపత్రికి వస్తే ఫార్మా కంపెనీల గిఫ్టులకు కక్కుర్తిపడి ప్రిస్క్రిప్షన్ నింపేసి తమకు అనుకూలమైన మెడికల్ షాపులకు పంపించేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఈ దందాను అరికట్టే చర్యలు తీసుకుంటారేమో చూడాలి.