మెడికల్ ఆక్సిజన్.. ఎందుకు? ఎవ‌రికి? ఎలా?

దేశ‌మంతా ఆక్సిజ‌న్ డిమాండ్‌. క‌రోనా రోగుల‌కు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ అత్యంత కీల‌కం. ప్రాణ‌వాయువైన ఆక్సిజ‌న్.. పేరుకు త‌గ్గ‌ట్టే క‌రోనా పేషెంట్స్‌కు ప్రాణ‌దాత‌గా మారుతోంది. మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు అంత డిమాండ్ ఎందుకు?  కొవిడ్ రోగుల‌కు ఎలా ఉప‌యోగం?  దాన్ని ఎలా త‌యారు చేస్తారు? ఇలా అనేక అంశాల‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది. 

మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 20.95 శాతం, నెట్రోజన్ 78 శాతం ఉంటాయి. ఆర్గాన్, నియాన్, కార్బన్ డైయాక్సెడ్, హీలియం, హైడ్రోజన్ త‌దిత‌ర‌ వాయువులు స్వల్పంగా ఉంటాయి. "మెడికల్ అసవరాలకు మాత్రం స్వచ్చమైన ఆక్సిజన్‌నే వాడతారు. పరిశ్రమల్లో తయారైయ్యే ఆక్సిజన్ 95 నుండి 99 శాతం వరకూ నాణ్యతతో ఉంటుంది. కొంత మలినాలతో కూడిన వాయువులు ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్‌ను పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేస్తారు. దానిలో ఇతర వాయువులు ఏవీ ఉండవు. మనిషి శ్వాసించే స్వ‌చ్చ‌మైన‌ వాయువులా దీన్ని మార్చడం వల్ల మెడికల్ ఆక్సిజన్ అంటారు. వైద్య పరిభాషలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అని పేరు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండ‌టం.. దేశ‌వ్యాప్తంగా రోజుకు 3 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకుతుండ‌టంతో రోగుల సంఖ్య భారీగా పెరిగి మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటోంది. ప్రతి వంద మంది కరోనా రోగుల్లో 20 మందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయి. వారిలో ముగ్గురికి మాత్ర‌మే ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి వ‌స్తోంది. కొవిడ్ కేసులు ఎక్కువ‌గా ఉండటంతో అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్య అవసరాల కోసమే ఉపయోగిస్తున్నాయి. మెడికల్ ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ ఉండ‌టంతో ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ కూడా సాగుతోంది. 

ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్నీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడా 40 శాతానికి మించి ఆక్సిజన్ అందుబాటులో లేదు. కరోనాతో పాటు ఇతర వ్యాధుల రోగులకు కూడా ఆక్సిజన్‌కు డిమాండ్ ఉంది. దీంతో కేంద్రం ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకొచ్చి కొర‌త ఉన్న రాష్ట్రాల‌కు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ప్లై చేస్తోంది.